పాదయాత్రలో కాళ్ళపీకులు

 

ఒకవైపు చంద్రబాబు మరో వైపు షర్మిల ఇద్దరూ కూడా రాష్ట్రాన్ని పాదయాత్రాలతో చుట్టేస్తున్నారు. ఇద్దరూ కూడా కాళ్ళ సమస్యలతో బాధపడుతున్నపటికీ, తమకన్నాఎక్కువ కష్టాల్లో ఉన్న ప్రజలని ఒదార్చడమే తమ తక్షణ కర్తవ్యంగా భావించి, చమటోడ్చి మరీ పాదయాత్రలు చేస్తున్నారు. ఒకవైపు వీరిద్దరూ ఎండనక వాననక పాదయాత్రలు చేస్తుంటే బ్యాక్ గ్రౌండ్లో వారివారి పార్టీ నేతలు కూడా చాలా వర్క్ చేస్తున్నారు. తమతమ నేతల కష్టాన్ని ప్రజలు గుర్తించేలా చేస్తూనే, అదే సమయంలో ఎదుట పార్టీ నేతల్ని బజారుకీడ్చేందుకు కూడా అంతే తీవ్రంగా శ్రమిస్తున్నారు.

 

మొన్న బీజేపీ నాయకుడు ప్రభాకర్, అటుమొన్న తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత, నిన్న తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దు కృష్ణంనాయుడు అందరూ వరుసకట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల మీద దండయాత్ర ప్రారంభించారు. “షర్మిలకు అసలు కాలికి ఏ దెబ్బా తగలలేదు, మోకాలికి ఆపరేషనూ జరుగలేదు, అంతా పెద్ద డ్రామా!” అంటూ హేళన చేసారు.

 

గాలి ముద్దు కృష్ణంనాయుడు మరో అడుగు ముందువేస్తూ షర్మిల ఒకసారి ఎడమకాలికి, మరోసారి కుడికాలికి బ్యాండేజీలు వేసుకున్న ఫోటోలను మీడియాకు విడుదలచేస్తూ, ఆమెకు కుడికాలుకి దెబ్బతగిలితే, మరి ఎడంకాలికి దెబ్బ తగిలినట్లు ఎందుకు నటించిందో అని ఎద్దేవా చేసారు. అసలు ఆమెకి ఏ దెబ్బా తగులలేదని, తగిలి ఉంటే జగన్ స్వంత బాకా మీడియా సాక్షి దాని గురించి జనాన్ని ఊదరగొట్టక వదిలేదా? ఆమె పడిపోయినప్పుడు ఆమె చుట్టూ ఉన్న సాక్షి మీడియా, ఆమెకు అంత పెద్దదెబ్బ తగిలినా కూడా కనీసం ఒక్క ఫోటో కూడా తీసి ప్రచురించలేదంటే, అసలు కధ అర్ధమవుతోందని ఆయన అన్నారు.

 

విపక్షాలు ఇంత రాద్దాంతం చేస్తుంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంబటి రాంబాబు వంటివారు చేతులు ముడుచుకొని కూర్చోరు గనుక, షర్మిలాకు దెబ్బ తగలలేదని, ఆమెకు ఆపరేషను జరుగలేదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది గనుక, దానిని వారే నిరూపించాలని సవాలు విసిరారు.

 

కొన్ని నెలల క్రితమే జగన్ పార్టీలో చేరిన చంద్రబాబు ప్రియ శత్రువు లక్ష్మీ పార్వతి, అంబటి వదిలేసిన మరో పాయింటు లేవనెత్తుకొని టీవీ ఛానళ్ళ ముందుకు వచ్చారు. షర్మిల పడిపోయినప్పుడు రెండు కాళ్ళకీ దెబ్బలు తగిలినందున, ఆరోజు ఆమె చంచల్ గూడ జైల్లో తన అన్నగారు జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు వెళ్తూనప్పుడు షర్మిల తన రెండో కాలి నొప్పి భరించలేకనే ఆవిధంగా నడిచేరని, అయితే, ఆవిషయాన్ని కూడా రాజకీయం చేయడం తెలుగుదేశం పార్టీకే చెల్లునని ఆమె విమర్శించారు.

 

అన్నీ మాట్లాడి, తన ప్రియ శత్రువు చంద్రబాబు గురించి మాట్లాడకపోతే ఆమె లక్ష్మీ పార్వతి ఎలావుతుంది? గనుక చంద్రబాబును కూడా సీన్లోకి లాకొచ్చారామె. ఆనాడు అలిపిరిలో చంద్రబాబు మీద నక్సలయిట్లు దాడిచేసినప్పుడు ఆయనకీ, మరో 15మందికి తీవ్ర గాయాలయినపుడు చంద్రబాబు చేతికి పెద్దకట్టు వేసుకొని, సానుభూతి ఓట్లు సంపాదించుకోవచ్చుననే దురాశకుపోయి ఏడాది కాలం మిగిలుండగానే ముందస్తు ఎన్నికలకి వెళ్లి బోర్లాపడలేదా అని చురకలు వేసి, ఆనాడు ఆయన ఆవిధంగా చేసినప్పుడు తప్పు పట్టనివారు ఇప్పుడు షర్మిలాను మాత్రం ఎందుకు తప్పుపడుతున్నారని ప్రశ్నించారు.

 

ఇరు పార్టీ నేతలు ఈ కాళ్ళ, చేతుల సమస్యలపై టీవీ చానళ్ళలో ఒకవైపు వాదులాడుకొంటుంటే, మరో వైపు షర్మిల చంద్రబాబులు ఇద్దరూ కూడా కాళ్ళు నొప్పులతోనే తమ పాదయాత్రలు కొనసాగిస్తునారు. షర్మిలకి మళ్ళీ ఇప్పుడప్పుడే బ్రేక్ తీసుకొనే ఆలోచనలేనపటికీ, చంద్రబాబు మాత్రం ఈ ఆదివారం పాదయాత్రకు శలవు ప్రకటించినట్లు సమాచారం.