కాంగ్రెస్ మిత్రుడి జోస్యం: బీజేపీ గెలుపు ఖాయం

 

గత ఆరేడు నెలలుగా వెలువడుతున్న సర్వే నివేదికలన్నీ మోడీ నేతృత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారం చేపడుతుందని ఘోషిస్తున్నప్పటికీ అవ్వన్నీ కూడా ఒట్టి గాలి కబుర్లేనని కాంగ్రెస్ నేతలు కొట్టిపడేస్తున్నారు. అయితే, గత పదిహేనేళ్ళుగా ఆ పార్టీతో కలిసి కాపురం చేస్తూ, కేంద్రమంత్రి పదవుల రాజభోగం కూడా అనుభవిస్తున్న మహారాష్ట్రకు చెందిన నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, ఈసారి ఎన్నికల తరువాత బీజేపీ అత్యధిక మెజార్టీ ఉన్న ఏకైక అతిపెద్ద పార్టీగా మొదటి స్థానంలో నిలుస్తుందని, కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంతో సరిబెట్టుకోవలసి ఉంటుందని ప్రకటించేసి కాంగ్రెస్ అధిష్టానానికి షాక్ ఇచ్చేరు. తమ పార్టీ దీనపరిస్థితి గురించి తెలిసినప్పటికీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఎన్నికల ప్రచారం చేసుకొంటున్న కాంగ్రెస్ అధిష్టానం, ఆయన సరిగ్గా ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ కీలక తరుణంలో ఉన్న మాటను కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పేసరికి ఉలిక్కిపడింది.

 

కొన్ని నెలల క్రితమే ఆయన మోడీని, బీజేపీని వెనకేసుకు వచ్చిన సంగతి గుర్తుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆయన కూడా బీజేపీ వైపు దూకేసి ఎన్నికల తరువాత ఎన్డీయే గూట్లో చేరిపోతారేమోనని ఆందోళన పడుతోంది. అయితే శరద్ పవార్ తన తుది శ్వాస వరకు కూడా కేంద్రమంత్రిగా అధికారం చలాయించాలని చాలా బలమయిన కోరిక ఉన్నపటికీ వృద్దాప్యం, ఆరోగ్యసమస్యల కారణంగా ఆయన ఈసారి ఎన్నికలలో పోటీ చేయడం లేదు. కానీ తన కుమార్తె సుప్రియా పాటక్ ను తన స్థానంలో సెటిల్ చేసేసిన తరువాతనే రాజకీయాల నుండి తప్పుకోవాలని భావిస్తున్నారు. అందువలననే ఈసారి విజవకాశాలు అధికంగా కనిపిస్తున్న బీజేపీని, మోడీని ఇప్పటి నుండే మంచి చేసుకొనే ప్రయత్నాలు చేస్తూ ఎన్నికలకు ముందో తరువాతో ఎన్డీయే గూట్లో తన కుమార్తెను చేర్చి రాజకీయాల నుండి తప్పుకోవచ్చును. ఒకవేళ ఆయన కూడా హస్తం పార్టీకి హస్తం చూపించినట్లయితే, ఇప్పటికే గెలుపు ఆశలు సన్నగిల్లుతున్న కాంగ్రెస్ పార్టీకి ఆ అవకాశాలు మరింత సన్నగిల్లవచ్చును.