కేసీఆర్ మీద శంకరమ్మ ఆగ్రహం!

 

 

 

తెలంగాణవాదులు అమరవీరుడని కొనియాడే శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని బతిమాలో, బెదిరించో ఎమ్మెల్యే టిక్కెట్ పొందడానికి హామీ పొందింది. కేసీఆర్ ఆమెకి ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి గెలవని నల్లగొండ జిల్లాలోని హుజూర్ నగర్ అసెంబ్లీ టిక్కెట్ ఇస్తానని చెప్పారు. అయితే గెలవని సీటు తనకి ఎందుకు అని శంకరమ్మ నెత్తీనోరు బాదుకుంటున్నప్పటికీ శుక్రవారం నాడు కేసీఆర్ ప్రకటించిన తొలి విడత అభ్యర్థుల లిస్టులో శంకరమ్మకు హుజూర్ నగర్ టిక్కెట్ కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.

 

అయితే ఈ నిర్ణయం శంకరమ్మకి ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తోంది. తను వద్దు మొర్రో అంటున్నా తాను ఖచ్చితంగా ఓడిపోయే సీటుని కేటాయించడం అన్యాయమని ఆమె తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు తెలిసింది.  కేసీఆర్ ప్రకటించినప్పటికీ తాను హుజూర్ నగర్ స్థానం నుంచి పోటీ చేయబోనని, తనకు గెలిచే స్థానం ఇస్తేనే పోటీ చేస్తానని శంకరమ్మ అంటున్నట్టు సమాచారం. అయితే శంకరమ్మ ఆక్రోశాన్ని టీఆర్ఎస్ నాయకులెవరూ పట్టించుకోవడంలేదు. పోనీలేపాపం అని ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే, ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటూ వుంటే ఇంకా కోరికలు కోరడం బాగాలేదని వారు అభిప్రాయ పడుతున్నారు.



అయితే శంకరమ్మ మాత్రం తన పట్టు విడిచిపెట్టడం లేదని సమాచారం. తనకు గెలిచే టిక్కెట్ ఇవ్వకుంటే తాను మరో పార్టీ నుంచి గెలిచే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని శంకరమ్మ అంటున్నా ఆమెని కేసీఆర్ లైట్‌గా తీసుకుంటున్నారు. దాంతో కేసీఆర్ మీద తీవ్ర ఆగ్రహంగా వున్న శంకరమ్మ భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.