అంతులేని శంకరన్న కధ

 

మాజీ మంత్రి శంకరావును నేరేడ్మెట్ పోలీసులు అరెస్ట్ చేసి వదిలేసినప్పటి నుండి, పరిస్థితులు ఒక్కసారిగా ఆయనకు అనుకూలంగా మారిపోయాయి. యస్సీ, బీసీ తదితత సంఘాల నాయకులు ఆయనకు మద్దతుగా కదిలి రావడం, ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులు కూడా ఆయనకు మద్దతునీయడంతో, కోర్టు ఆదేశాలపై ఆయనను అరెస్ట్ చేసిన నేరేడ్మెట్ పోలీసుల పరిస్థితి దయనీయంగా మారింది. వివిధ వర్గాల నుండి వస్తున్న ఒత్తిడితో ముఖ్యమంత్రి సిఐడీ విచారణకు ఆదేశించినా, శంకర్ రావు మాత్రం సీబీఐ విచారణకు పట్టు పడుతూ సిఐడీ అధికారికి సహకరించడం లేదు.

 

వెల్లువెత్తిన మద్దతును చూసిన తరువాత ఆయన కుటుంబ సభ్యులలో బహుశః ఆత్మవిశ్వాసం పెరగడం వల్లనేమో, శంకర్ రావు కుమార్తె సుష్మిత తన తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసు అధికారులు, డీజీపీ దినేష్ రెడ్డి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలపై ముషీరాబాద్ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేసారు. తన తండ్రి హోం మంత్రిత్వశాఖను డీజీపీ దినేష్ రెడ్డి, ఆయన భార్య ఆస్తుల వివరాలు కోరుతూ దరఖాస్తు చేసినందునే, దినేష్ రెడ్డి పోలీసులను తన తండ్రిపై ఉసిగొల్పారని అందువల్ల అందరిపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఆమె తన పిర్యాదులో కోరారు. అయితే, పిర్యాదులో తమ పై అధికారి పేరు, ముఖ్యమంత్రి పేరు చేర్చడంతో న్యాయ నిపుణుల సలహా తీసుకొన్న తరువాతనే చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.

 

ఇటువంటి సంఘటనలు పోలీసుల మనోస్థయిర్యాన్ని దెబ్బ తీయడమే గాకుండా, వారు కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి వెనకాడే పరిస్థితులను కల్పిస్తాయి. శంకర్ రావుకు భాసటగా నిలిచినవారు, ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం తప్పని భావిస్తున్నారా లేక ఆయనను అరెస్ట్ చేసిన తీరును తప్పు పడుతున్నారా? మొదటి కారణం అయితే అది కోర్టు దిక్కారం అవుతుంది. రెండవ కారణం అయితే అది మానవ హక్కుల రక్షణ క్రిందకు వస్తుంది. ఏమయినపటికీ, ఈ సంఘటనలతో శంకరావు మళ్ళీ మీడియా కెక్కడమే గాకుండా, తన వెంటబడి వేదిస్తున్న గ్రీన్ ఫీల్డ్ కేసుల నుండి తాత్కాలికంగా బయట పడగలిగారు.