దిల్‌సుఖ్‌నగర్ మారణహోమానికి ఏడేళ్లు... హైదరాబాదీలను వెంటాడుతోన్న గాయం

సరిగ్గా ఏడేళ్ల క్రితం... ఇదే రోజు... బాంబు పేలుళ్లలో భాగ్యనగరం ఉలిక్కిపడింది. 2013... ఫిబ్రవరి 21... రాత్రి 7గంటలు... హైదరాబాద్‌లో అత్యంత రద్దీ ప్రాంతమైన దిల్‌‌సుఖ్‌నగర్‌ జనంతో కిటకిటలాడుతోంది... ప్రయాణికులు, విద్యార్ధులు, ఉద్యోగులు... ఇలా అన్ని వర్గాల ప్రజల రాకపోకలతో బస్టాండ్లు, షాపింగ్ మాల్స్‌, దుకాణాలు, రోడ్లూ... అన్నీ రద్దీగా ఉన్నాయి... ఎవరి పనుల్లో వాళ్లున్నారు... తమతమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి బస్టాప్‌‌లో కొందరు వేచిచూస్తుంటే, మరికొందరు, వేడివేడి మిర్చి బజ్జీలు, ఛాయ్ తాగడానికి ఏ1 టిఫిన్ సెంటర్‌ దగ్గర గుమిగూడారు. ఇలా, ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండగా, సరిగ్గా రాత్రి 7గంటల 2 నిమిషాలకు... భారీ శబ్ధంతో బస్టాప్‌‌లో బాంబు పేలుడు సంబవించింది. అంతలోనే ఏ1 టిఫిన్ సెంటర్‌ దగ్గర మరో బాంబు పేలుడు పేలింది. జనమంతా ఉరుకులు పరుగులు తీశారు. అసలేం జరిగిందో తెలుసుకునేలోపే అక్కడంతా భయానకంగా మారిపోయింది. ఎటుచూసినా రక్తపు ధారలే. మాంసపు ముద్దలే. దాంతో, దిల్‌సుఖ్‌నగర్ రోదనలతో మార్మోగింది. ఈ బాంబు పేలుళ్లలో 18మంది స్పాట్‌లోనే మరణించగా, 50మందికి పైగా తీవ్రంగా గాయపడి జీవశ్చవాలుగా బతుకుతున్నారు.

దిల్‌సుఖ్‌నగర్ మారణహోమం జరిగి ఏడేళ్లు గడిచిపోతున్నా... ఇప్పటికీ మానని గాయంగా హైదరాబాదీలను వెంటాడుతోంది. బాంబు పేలుళ్లలో తమ ఆత్మీయులను గొట్టుకున్నవారంతా ఇప్పటికీ కోలుకోలేదు. తమవారిని తలుచుకుంటూ ప్రతిక్షణం కన్నీరుమున్నీరవుతున్నారు.