అనుకున్నది ఒకటి..అయినది ఒకటి... టీఆర్ఎస్ లో ఆశావహుల నిరాశ పర్వం

 

టీఆర్ఎస్ పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చాక చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశించారు. క్యాబినెట్ లో 17 మందికి మాత్రమే చోటు ఉండడంతో కేవలం కొద్ది మందికే అదృష్టం దక్కింది. పదవులు ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు వారంతా చెప్పుకొచ్చారు. ఆ తరుణం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయంలోనే ఇటీవల కొన్ని కీలక పదవులను భర్తీ చేసింది గులాబీ పార్టీ అధిష్టానం. అయితే ఆ పదవులు కూడా దక్కక పోవడంతో కొందరు ఎమ్మెల్యేలు నిరాశకు గురైయ్యారని అధికార పార్టీలో చర్చ జరుగుతోంది.

ఇటీవల రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించారు సీఎం కేసీఆర్. అయితే మంత్రివర్గంలో చోటు ఆశించి భంగపడ్డ నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి కీలక పదవి ఇస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. గుత్తా సుఖేందర్ రెడ్డికి మండలి చైర్మన్ పదవి ఇవ్వడంతో ఆయన నిర్వహించిన రైతు సమన్వయ సమితి పగ్గాలు బాజిరెడ్డికి ఇస్తామని కేటీఆర్ చెప్పినట్లు సమాచారం. దీంతో బాజిరెడ్డి సైతం ఆ పదవి తనకే వస్తుందన్న ఆశతో మానసికంగా సిద్ధమైపోయారు. కాని ఆ పదవిని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కట్టబెట్టడంతో బాజిరెడ్డి నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. 

ఇదే పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి ఎదురైంది. ఆయనకు శాట్స్ ఛైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఆ పదవిని నిర్వహించిన వెంకటేశ్వరెడ్డికే దాన్ని రెన్యువల్ చేశారు కేసీఆర్. దీంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. చాలా మంది ఎమ్మెల్యేలు తమకు కీలక పదవులు వస్తాయని ఆశించినా ఫలితం లేకుండా పోయింది. తమ ఆశలకు గండి పడుతుండడంతో సన్నిహితులు.. అనుచరుల వద్ద వారి గోడు వెళ్లబోసుకుంటున్నారు. 

పార్టీ ఎమ్మెల్యేలకు కొంతమంది ముఖ్యనేతలకు కేటీఆర్ పదవులిస్తామని చెబుతుంటే కేసీఆర్ మాత్రం తన జాబితాలో ఉన్న వారికే పదవులు కట్టబెడుతున్నారంటూ అధికార టీఆర్ఎస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. కేటీఆర్ ఇచ్చిన మాట అమలు కాకపోవడం హామీ పొందిన నేతలను కలవరానికి గురి చేస్తోంది. ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలకూ ఏదో ఒక పదవి కట్టబెడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇక కొన్ని బహిరంగ సభల్లో కేసీఆర్ సైతం హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ గానూ, కార్పొరేషన్ చైర్మన్ లు గానూ అవకాశం కల్పిస్తామని చెప్పారు. దీంతో వారంతా పదవుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలతో చాలా మంది నేతలు పదవులు దక్కుతాయో లేదోనన్న బెంగతో ఉన్నట్టు తెలుస్తోంది.