టాలీవుడ్ లో విషాదం...విజయనిర్మల మృతి


అలనాటి నటి, దర్శకురాలు, నటుడు కృష్ణ రెండవ భార్య విజయనిర్మల నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఇక ఆమె వయసు ప్రస్తుతం 73 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నిన్న రాత్రి పొద్దుపోయాక ఆమె కన్నుమూశారు. విజయనిర్మల తండ్రిది చెన్నై కాగా, తల్లిది గుంటూరు జిల్లా నరసరావుపేట. 20 ఫిబ్రవరి 1946లో జన్మించిన విజయనిర్మల 1950లో మత్య్సరేఖ అనే తమిళ సినిమా ద్వారా నాలుగో ఏటనే బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇక పదకొండేళ్ల వయసులో ‘పాండురంగ మహత్యం’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు.

‘రంగులరాట్నం’ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన విజయనిర్మల దాదాపు 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిగా మెప్పించారు.  మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం విజయనిర్మల కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు నరేష్ ఒక్కడే సంతానం కాగా జయసుధకి ఈమె పిన్ని అవుతారు. తనకు సినీ పరిశ్రమలో మొదటిసారి అవకాశమిచ్చిన విజయ స్టూడియోస్‌కు కృతజ్ఞతగా విజయనిర్మలగా పేరు మార్చుకున్నారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారు. సినిమాకు ఆమె చేసిన సేవలకుగాను 2008లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు. విజయనిర్మల మృతి వార్త తెలుగు చిత్ర పరిశ్రమను విషాదంలోకి నెట్టి వేసింది. ఇక మహేష్ కి ఈమె పినతల్లి అవుతారు.