సీమాంధ్ర చెవిలో కాంగ్రెస్ పువ్వు!

 

 

 

రాష్ట్ర విభజన ద్వారా సీమాంధ్ర ప్రజల్ని దారుణంగా మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రజలు మీ మోసాలు సాగవంటూ సీమాంధ్రులు వందరోజులకు పైగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. సీమాంధ్రులను శాంతింపజేయనిదే రాష్ట్ర విభజన సజావుగా సాగదన్న విషయం కాంగ్రెస్ హైకమాండ్‌కి అర్థమైంది. దాంతో సీమాంధ్రుల చెవుల్లో పూలు పెట్టి, శాంతపరిచే కార్యక్రమాలు చేపట్టింది.

 

మూడు రోజుల క్రిందటి వరకూ సీమాంధ్రులు కూడా మనుషులేనా అన్నట్టు వ్యవహరించిన కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సీమాంధ్రులకు అనుకూలంగా ఉందన్న సంకేతాలను లీకుల రూపంలో  బయటపెడుతోంది. ఆంటోనీ కమిటీ కాంగ్రెస్ నాయకత్వానికి ఇచ్చిన నివేదికలో సీమాంధ్రులకు అనుకూలంగా అనేక అంశాలు ఉన్నట్టు క్రియేట్ చేసింది. అలాగే భద్రతకి సంబంధించి నియమించిన టాస్క్ ఫోర్స్ కూడా సీమాంధ్రులకు అనుకూలంగా ఉండే విధంగా నివేదిక సమర్పించినట్టు కలరింగ్ ఇచ్చింది. అలాగే కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీలో ముఖ్యమంత్రి చేసిన వాదనే పైచేయి సాధించినట్టు, పరిస్థితులు సీమాంధ్ర ప్రాంతానికి అనుకూలంగా మారుతూ ఉండటంతో భేటీలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు లీకులు పంపించింది.




ఇవన్నీ చూసి సీమాంధ్ర ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం మరీ తాము అనుకున్నంత చెడ్డది కాదని భావించి, కాంగ్రెస్ మీద వున్న ఆగ్రహాన్ని తగ్గించుకుంటారని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్టు విశ్లేషకులు అంటున్నారు. తమ చేతి నుంచి జారిపోయిన సీమాంధ్రులను మళ్ళీ తమ గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నాల్లో భాగమే ప్రస్తుత పరిణామాలని విశ్లేషకులు అంటున్నారు. వీటన్నిటి తోడు ముఖ్యమంత్రి కిరణ్ తాజాగా రాష్ట్రాన్ని విభజించాల్సి రావడం పట్ల దిగ్విజయ్ చాలా బాధపడిపోతున్నారని చెప్పడం కూడా సీమాంధ్రుల చెవుల్లో పూలు పెట్టే కాంగ్రెస్ వ్యూహంలో భాగమేనని విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు మొసలి కన్నీరు కార్చడం కాదు.. గుండెలు బాదుకుని రోదించినా వారిని సీమాంధ్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరు.