ఇక సీమాంధ్ర వంతు

 

కాంగ్రెస్ పార్టీలో సహజసిద్దమయిన నాటకీయ పరిణామాల తరువాత రాజ్యసభ ఎన్నికలు ముగిసాయి. అధిష్టానం తను ప్రతిపాదించిన ముగ్గురు అభ్యర్ధులతో పాటు తెరాస అభ్యర్ధి కేశవ్ రావుని కూడా గెలిపించుకొంది. మరి కాకతాళీయమో లేక వ్యూహాత్మకమో కానీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది సేపటికే కేంద్ర క్యాబినెట్ తెలంగాణా బిల్లుని కూడా ఇంచుమించుగా యధాతధంగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించింది. క్యాబినెట్ ఆమోదించిన బిల్లుని ఈరాత్రే రాష్ట్రపతికి పంపించవచ్చని కూడా తెలియజేసింది. టీ-బిల్లు రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేసుకొని రాగానే ఈనెల 12న రాజ్యసభలో ప్రవేశపెడతామని కొత్త ముహూర్తం కూడా ప్రకటించేసింది. వీటితో తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ప్రసన్నం అయినట్లయితే, ఆ పార్టీని విలీనమో లేకపోతే కనీసం ఎన్నికల పొత్తులకయినా ఒప్పించగలిగితే, ముందు అనుకొన్న పధకం ప్రకారం ఇక తెలంగాణాలో వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేదు.

 

ఇక కాంగ్రెస్ పార్టీపై భగ్గుమంటున్న సీమాంధ్రలో చాలా చాకచక్యంగా నిర్వహించవలసిన పనులు కొన్ని మిగిలిపోయాయి. మొట్ట మొదట తన సమైక్య సింహం కిరణ్ కుమార్ రెడ్డిపై వేటువేసి పార్టీ నుండి బయటకు సాగనంపి, సీమాంధ్ర ప్రజలలో ఆయనకు సానుభూతి, దానితో బాటు సమైక్యవీరుడుగా ప్రత్యేక గుర్తింపు కలిగించాలి. పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదించేలోగా దిగ్విజయ్, షిండే, చాకో వంటివారు రంగంలో దిగి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ, కొత్త పార్టీ స్థాపనకు తగిన వాతావరణం సృష్టించాలి. ఆ తరువాత కొత్తపార్టీ తన అభ్యర్ధుల జాబితాను విడుదల చేసేక, ఆ జాబితా ప్రకారం వారిపై పోటీ చేసే తన డమ్మీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేయాలసి ఉంటుంది. ఇక ఇటీవల కాలంలో దారితప్పుతున్నట్లు కనబడుతున్న తన మరో సమైక్యసింహాన్ని కూడా ఎన్నికలలోగా తన చిలకలను ప్రయోగించయినా సరే మచ్చిక చేసుకొని మళ్ళీ దారికి తెచ్చుకోవలసి ఉంటుంది.

 

ఆ తరువాత యువరాజవారి సైన్యాధ్యక్షతలో సొనియా-రాహుల్ భక్తజన శ్రేణులందరూ ఉత్సాహంగా కదనరంగంలోకి దూకి తెదేపాను డ్డీకొనాలి. వీలయితే తన రెండు సమైక్య సింహాలతో హోరాహోరీ యుద్ధం చేస్తున్నట్లు నటించాలి. అంతిమంగా ఆ రెండింటిని గెలిపించుకొని మళ్ళీ వెనక్కి రప్పించుకోవాలి. అందుకు చాలా శ్రమ పడాలి. కానీ, యువరాజవారి పట్టభిషేకం జరగాలంటే ఆ మాత్రం కష్టపడక తప్పదు మరి.