సోనియాగాంధీ కి సీమాంధ్ర మంత్రుల షాక్

 

ఇంతకాలం కాంగ్రెస్ అధిష్టానం గీసిన గీత దాటకుండా మసులుకొన్న సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు, కేంద్ర మంత్రులు అందరూ కూడా ఈరోజు లోక్ సభలో తమ అధినేత్రి సోనియాగాంధీ వారిస్తున్నా వినకుండా స్పీకర్ పోడియం చుట్టుముట్టి సభను సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించి అధిష్టానానికి పెద్ద షాక్ ఇచ్చారు. కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి, పల్లం రాజు, పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తమ సహచర సీమాంధ్ర యంపీలతో కలిసి స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తూ సభను స్థంభింపజేశారు. మరో ఇద్దరు మంత్రులు కిల్లి క్రుపారాణీ, కిషోర్ చంద్ర దేవ్ తమ తమ స్థానాల వద్దనే నిలబడి నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. రైల్వేమంత్రి మల్లిఖార్జున్ ఖార్గే మధ్యంతర రైల్వే బడ్జెట్ సభలో ప్రవేశపెడుతుంటే, రైల్వేసహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, స్పీకర్ పోడియం వద్ద మిగిలిన మంత్రులు, యంపీలతో కలిసి ఆందోళన చేయడం విశేషం.

 

సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు మంత్రులు నినాదాలు చేస్తుంటే, వారికి పోటీగా తెలంగాణా కాంగ్రెస్ యంపీలు కూడా జైతెలంగాణా నినాదాలు చేయడంతో సభ స్తంభించిపోయింది. తెదేపా యంపీ శివ ప్రసాద్ మరియు తెరాస యంపీ మందా జగన్నాధం మధ్య తోపులాట జరగడంతో సభలో యుద్దవాతావరణం ఏర్పడింది.

 

రేపు లోక్ సభలో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది గనుక, బహుశః సీమాంధ్ర యంపీ, కేంద్ర మంత్రులందరినీ సభ నుండి సస్పెండ్ చేయమని స్పీకర్ ను కోరవచ్చును. కానీ, బీజేపీతో సహా విపక్షాలన్నీ కూడా సభ నుండి సభ్యులను సస్పెండ్ చేయడానికి ముందే అభ్యంతరం వ్యక్తం చేసాయి గనుక ఈ ఆందోళన రేపు మరింత తీవ్రంగా కొనసాగవచ్చును. ఈరోజు ప్రధాని డా. మన్మోహన్ సింగ్ తెలంగాణా బిల్లుకి బీజేపీ మద్దతు కోరేందుకు బీజేపీ అగ్రనేతలను మధ్యాహ్నం విందు భోజనానికి ఆహ్వానించారు. కానీ, స్వంత పార్టీ సభ్యులే ఇంతగా అభ్యంతరం చేపుతున్నపుడు ఇక బీజేపీ మద్దతుని కోరడం కూడా హాస్యాస్పదంగా ఉంటుంది. బహుశః బీజేపీ నేతలు అదే మాట ఆయనకి చెప్పవచ్చును.