మల్కాజ్‌గిరిలో సత్తా చాటేది ఎవరు? ఓటరు ఎటు వైపు?

మల్కాజ్ గిరి పై పట్టుకోసం రాజకీయపార్టీలు హోరా హోరీగా త‌ల‌ప‌డుతున్నాయి.  ఇక్క‌డ మూడు పార్టీల మ‌ధ్య ఆసక్తికరమైన పోరు నెల‌కొంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో  దేశంలోని అన్ని రాష్ట్రాల, ప్రాంతాల ప్ర‌జ‌లు ఉంటారు. అందుకే మ‌ల్కాజ్ గిరి అంటే మినీ ఇండియాగా పేరుంది. పైగా దేశంలోని అతిపెద్ద లోక్ స‌భ సెగ్మెంట్ల‌లో కూడా మ‌ల్కాజ్ గిరి ఒక‌టి. సీఎం రేవంత్ రెడ్డి మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డి నుండే ప్రాతినిధ్యం వ‌హించారు. ఇప్పుడు  బీఆర్ ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ నేత‌లంతా ఫోక‌స్ చేస్తున్నారు. మ‌ల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థి రాగిడి ల‌క్ష్మారెడ్డి బ‌రిలో వున్నారు. ఇత‌నికి అండ‌గా మ‌ల్లారెడ్డి వున్నారు.  మ‌ల్కాజ్ గిరి ప‌రిధిలోని మేడ్చ‌ల్, మ‌ల్కాజ్ గిరిలో మ‌ల్లారెడ్డి, ఆయ‌న అల్లుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరికి భారీ అనుచ‌ర‌గ‌ణం కూడా ఉండ‌గా, గ‌తంలో మ‌ల్కాజ్ గిరి నుండి మ‌ల్లారెడ్డి ఎంపీగా కూడా ప‌నిచేశారు.  మ‌ల్కాజ్‌గిరి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గంలో ఏడుగురు ఎమ్మెల్యేలు మ‌న ద‌గ్గ‌ర్నే ఉన్నారు. 200 మందికి పైగా కార్పొరేట‌ర్లు కూడా బీఆర్ఎస్ కు చెందిన వారే ఉన్నారు.  ప‌దేండ్ల నిజానికి, వంద రోజుల అబ‌ద్దానికి, మ‌రో ప‌దేండ్ల విధ్వంస కేంద్ర పాల‌న‌కి  మ‌ధ్య యుద్దం అంటూ బీఆర్ ఎస్ ప్ర‌చారం చేస్తోంది.  ఈటెల‌కు, ప‌ట్నం సునీతాకు ఇంగ్లీషు, హిందీలో మాట్లాడ‌డం రాదు. వాళ్ళు పార్ల‌మెంట్‌కు వెళ్ళి ఏం మాట్లాడ‌తారాని బీఆర్ ఎస్ నిల‌దీస్తోంది. అదే రాగిడి ల‌క్ష్మారెడ్డికి ఇంగ్లీష్, హిందీలో అద్భుతంగా మాట్లాడుతారు.. ప‌క్కా లోకల్ వ్య‌క్తి అయిన‌ అత‌ను మీ గొంతుక‌గా పార్ల‌మెంట్‌లో మాట్లాడుతారని బీఆర్ ఎస్ ప్ర‌చారం చేస్తోంది.  తెలంగాణ‌కు బీజేపీ ప్ర‌భుత్వం చేసిందేమీ లేదని చెప్పారు కేటీఆర్ ప‌దే ప‌దే చెబుతున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలకు ఎన్నో మెడిక‌ల్ కాలేజీలు ఇచ్చిన కేంద్రం, తెలంగాణకు మాత్రం గుండు సున్నా చుట్టిందని, కనీసం ఒక్క న‌వోద‌య పాఠ‌శాల కూడా ఇవ్వ‌లేదని, కొత్త‌గా ఒక్క విద్యాసంస్థ ఇవ్వ‌కుండా ప్ర‌ధాని కాల‌యాప‌న చేశారని అన్నారు.   కాంగ్రెస్ నుండి ప‌ట్నం సునీతా మ‌హేంద‌ర్‌రెడ్డి పోటీ లో ఉన్నారు. మంత్రి తుమ్మ‌ల‌కు ఇక్క‌డ ఇంచార్జ్ ఇవ్వ‌టంతో గెలుపుపై కాంగ్రెస్ న‌మ్మ‌కంగా ఉంది.  సిట్టింగ్ సీటుపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. గ‌త ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డి గెలుపొందిన నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో మల్కాజిగిరి సీటును కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా ఈ స్థానంలో విజయం సాధించడమే కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతోంది.  అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్ల‌మెంట్ ప‌రిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెల‌వ‌క పోవడం కొంచెం మైనస్. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా, ఇక్కడి ప్రజలు మాత్రం బీఆర్ఎస్ కు జై కొట్టారు. చేవెళ్ల నుంచి అనుకున్న అభ్యర్థిని, ఎందుకో మల్కాజిగిరిలో బరిలో దింపారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌రిగిన త‌ప్పిదాలు జ‌ర‌గ‌కుండా, విజ‌య‌కేత‌నం ఎగుర‌వేయాల‌ని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. తాము గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి సాధ్యం అంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కూక‌ట్‌ప‌ల్లి, కుత్బుల్లాపూర్‌, మేడ్చల్‌, మ‌ల్కాజ్‌గిరి, ఉప్పల్‌, ఎల్బీన‌గ‌ర్, కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో అంత‌ర్భాగ‌మైన ఈ నియోజకవర్గాలు కీలక ప్రాంతాలు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మల్కాజిగిరి నియోజ‌క‌వ‌ర్గంలో దేశ ర‌క్షణ‌ రంగానికి చెందిన ఏయిర్ ఫోర్స్‌, ఆర్మీ స్థావరాలతో పాటు పారిశ్రామిక‌రంగం, విద్యారంగానికి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన యూనిర్శిటీలకు  కేరాఫ్ అడ్రస్‌గా ఉంది.  ఈ నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 38 ల‌క్షల ఓట‌ర్లు ఉన్నారు.     నార్త్ ఇండియా నుండి ఎక్కువ మంది నివాస‌ముంటున్న సీటు కావ‌టంతో గెలుపు ఈజీ అవుతుంద‌న్న ఆశ‌ల్లో బీజేపీ నేత‌లు ఉన్నారు. ఇటీవ‌ల గ‌జ్వేల్, హుజురాబాద్ నుండి పోటీ చేసిన ఈట‌ల రాజేంద‌ర్  బీజేపీ అభ్య‌ర్థిగా ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు.  మ‌ల్కాజిగిరి ఎంపీ స్థానాన్ని నెగ్గాలని బీజేపీ సైతం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని వ్యూహాలు రచిస్తోంది. మోదీ ప్రధానిగా హ్యాట్రిక్ కొడతారని చెబుతూ పార్లమెంట్ స్థానాలను గెలిపించాలని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని న‌రేంద్ర మోదీ ఇటీవల మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో రోడ్ షో సైతం నిర్వహించారు. మోదీ ప్రజాద‌ర‌ణ క‌లిసొస్తుంద‌ని అధిష్టానం ధీమాతో ఉంది. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ వంటి బ‌ల‌మైన అభ్యర్థి బరిలో ఉన్నారు. ఒక్కసారి కూడా మ‌ల్కాజిగిరి సీటు నెగ్గకపోవడంతో తో ఈసారి ఖ‌చ్చితంగా సాధించాలని ప‌ట్టుద‌ల‌తో ఉంది.  ఈసారి మాత్రం మోదీ మేనియాతో నెగ్గాలని ప్లాన్ చేస్తోంది. సిట్టింగ్ సీటు కోసం కాంగ్రెస్ ఫోకస్ చేస్తుండగా, కనీసం ఒక్కసారైనా మల్కాజిగిరిపై తమ జెండా ఎగరేయాలని బీఆర్ఎస్, బీజేపీ భావిస్తున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలో బీజేపీకి మంచి ఓట్‌ బ్యాంక్‌ ఏర్పడింది. వ్యక్తిగతంగా తనకున్న ఇమేజ్‌, పార్టీ సపోర్ట్‌.. ఈ రెండు కలిసివచ్చే అంశాలు ఉన్నట్లు ఈటెల లెక్కలు వేసుకుంటున్నారట.   తెలంగాణవాదుల్లో ఉదారవాదిగా ఉన్న ఈటల రాజేందర్ రెండు ప్రాంతాల ప్రజలు, గ్రేటర్ హైదరాబాద్‌లో కలిసిమెలిసి జీవించాలని కోరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 14 శాతం ఓట్లు, 8 సీట్లు సాధించడంలో కీలకమయ్యారు. ఈటల ప్రచారం నిర్వహించిన చోట్ల బీజేపీ అభ్యర్థులకు ఘననీయంగా ఓట్లు రావడం కూడా ఆయన పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్న క్రేజ్‌ను చాటుతోంది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదాన్ని బీజేపీ తీసుకోడానికి ముఖ్య కారణం ఈటల అని గుర్తుంచుకోవాలి. ఈ లోకసభ ఎన్నికల్లో 10 స్థానాలు గెలుచుకోవాలని, 35 శాతం ఓట్లు రాబట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.   ఇక్క‌డ పోటీ  కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉండటం, దేశ వ్యాప్తంగా బీజేపీకి ఉన్న సానుకూలత కలిసి వస్తాయన్న అభిప్రాయం ఉంది. ఈటల రాజేందర్ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సన్నిహితంగా ఉండటం కూడా ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. హైదరాబాద్‌లో మరీ ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో హిందుత్వం, బీజేపీకి అడ్వాంటేజ్ అన్న భావన ఉంది.  - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: Apr 25, 2024 10:57AM

భార్యలు భర్తల నుండి ఏం కోరుకుంటారు...బంధం దృఢంగా ఉండటానికి ఏది ముఖ్యం?

విజయవంతమైన,  సంతోషకరమైన వివాహా బంధానికి ప్రేమ మాత్రమే ముఖ్యం  కాదు. బంధంలో  భార్యను సంతోషంగా ఉంచడం కూడా చాలా ముఖ్యం.  ప్రతి భార్యకు తన భర్త నుండి కొన్ని అంచనాలు ఉంటాయి.  అవి నెరవేరితే బంధంలో తగాదాలు తగ్గుతాయి.   బంధం కూడా బలపడుతుంది. అవి నేరవేరకపోతే మాత్రం బంధం బలహీనంగా మారుతుంది. చిన్న ప్రయత్నాలు మానవ సంబంధాలలో దేనినైనా బలోపేతం చేయగలవు.  భార్యాభర్తల సంబంధం విషయానికి వస్తే అది మరింత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వివాహం అనేది ఒక పవిత్ర బంధం. దీనిలో ప్రేమ, గౌరవం,  అవగాహన అనే పునాదిపై కలిసి జీవితాన్నిగడపాల్సి ఉంటుంది.   ఇది పరస్పర అవగాహనతోనూ, బంధంలో పలు విషయాల పట్ల సహనంతో ఉండటం ద్వారా జరుగుతుంది. స్త్రీలు తమ భర్తల గురించి కొన్ని అంచనాలను కలిగి ఉంటారు. వాటిని నెరవేర్చడం ద్వారా ఏ భర్త అయినా తన భార్యను సంతోషంగా ఉంచగలడు. భార్యలు భర్తల నుంచి ఏమి ఆశిస్తారో తెలుసుకుంటే.. ప్రేమ.. ప్రతి స్త్రీ తన భర్త నుండి ప్రేమ,  ఎమోషనల్ సపోర్ట్ ఆశిస్తుంది. ఉద్యోగం చేసే మహిళ అయినా లేదా గృహిణి అయినా.. ఇద్దరూ తమ జీవిత భాగస్వామి అడుగడుగునా తమకు తోడ్పాటు అందించాలని కోరుకుంటారు. ప్రేమను వ్యక్తపరచడం కూడా వారికి ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమను వ్యక్తం చేయడం ద్వారా భార్యాభర్తల బంధం లోతుగా, దృఢంగా మారుతుంది. శ్రద్ద..  ఒకరిని ఎంతగా ప్రేమిస్తున్నారో వ్యక్తం చేయడానికి ఉత్తమ మార్గం వారి పట్ల శ్రద్ధ వహించడం.  భార్యకు ఇంటి పనిలో సహాయం చేయడం, ఆమె మానసిక స్థితి సరిగా లేకుంటే ఆమె ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి ప్రయత్నించడం, ఆమె అనారోగ్యంతో లేదా ఇతర పనులలో బాగా బిజీగా ఉన్నట్లయితే ఆమెకు ఇష్టమైన ఆహారాన్ని వండడం లేదా ఆర్డర్ చేయడం,  ఆమెకు తినిపించడం, ఆమె చెప్పేది శ్రద్ధగా వినడం, ఆమె కోసం సమయం కేటాయించడం..  ఇవన్నీ చిన్నవి కానీ శ్రద్ధ చూపిస్తున్నామని చెప్పడానికి ఇవి చాలా మంచి మార్గాలు. గౌరవం.. ఏదైనా సంబంధానికి పునాది గౌరవం మీద ఆధారపడి ఉంటుంది. భార్యలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వని భర్తలు ఎందరో ఉన్నారు. వివాహిత సంబంధంలో దీనిని పొందడానికి భార్యలు ఎక్కువగా పోరాడవలసి ఉంటుంది. భార్యలు తమ భర్తలను ప్రేమించడమే కాకుండా వారి అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని, సమానంగా చూడాలని,  తమ ఆత్మగౌరవాన్ని తమకు ఇష్టమైనవారి దగ్గర   దెబ్బతీయకూడదని భార్యలు కోరుకుంటారు. భర్త ఇవన్నీ చేస్తే భార్యలు తమను ఎంతగా గౌరవిస్తారో గ్రహించగలుగుతారు కమ్యూనికేషన్.. భార్యాభర్తల మధ్య ఎలాంటి సంకోచం లేకుండా ఓపెన్ కమ్యూనికేషన్ ఉండటం చాలా ముఖ్యం. భార్య తన భర్త తనతో ప్రతిదీ పంచుకోవాలని,  జడ్జ్ చేయకుండా జాగ్రత్తగా వినాలని కోరుకుంటుంది. భార్యాభర్తల బంధంలో  ఒకరికొకరు నిజాయితీగా,  మంచి  నమ్మకంతో  కలిగి ఉండటం చాలా ముఖ్యం. కానీ ఫలానా వ్యక్తి వల్ల భార్య అభద్రతా భావంతో బాధపడుతుంటే, భర్త ఆమెను పట్టించుకోకుండా ఉండటం సరికాదు.  ఈ భావాన్ని తొలగించడానికి భర్త ప్రయత్నించాలి. తద్వారా వారి మధ్య నమ్మకం బలపడుతుంది. అవగాహన.. భార్యాభర్తల మధ్య సంబంధాలలో పరస్పర అవగాహన చాలా ముఖ్యం. చాలా మంది మహిళలు తమ భర్తలు తమను అర్థం చేసుకోవడం లేదని భార్యలను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని మనస్తత్వంతో ఉంటారని ఫిర్యాదు చేస్తారు. కానీ ప్రతి భర్త తన భార్య ఇష్టాలు,  అభిరుచులను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇదే వారి బంధానికి శ్రీరామ రక్ష.                                                             *నిశ్శబ్ద.
Publish Date: Apr 25, 2024 10:34AM

అలీ ఎక్కడ? కనిపించడేం?

జగమెరిగిన కమేడియన్ అలీ..  ఎలాగైనా సరే చట్టసభకు వెళ్లాలని తహతహలాడారు. అన్ని పార్టీలూ తిరిగి, అన్ని చర్చలూ జరిపి.. తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకునేది ఒక్క వైసీపీ మాత్రమేనని నమ్మి గత ఎన్నికల ముందు ఆయన జగన్ ను నమ్ముకుని ఫ్యాన్ పార్టీ గూటికి చేరారు. ఆ క్రమంలో ఆయన సినీ పరిశ్రమలో  పవన్ కల్యాణ్ వంటి మిత్రుడిని దూరం చేసుకోవడానికి కూడా వెనుకాడలేదు. జనసేనానితో రాజకీయ ప్రవేశంపై అలీ చర్చించారు. అలీ జనసేన గూటికి చేరడం ఖాయమని కూడా అప్పట్లో అంతా భావించారు. కానీ అక్కుంబుక్కుం అంటూ అలీ జగన్ పంచన చేరాడు. దీనిపై మనవాళ్లనుకున్న వారు, మన నుంచి సహాయం పొందిన వారూ కూడా మోసం చేశారని పవన్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు కూడా. అయితే అప్పట్లో అలీ పవన్ మాటలకు చాలా ఘాటుగా రిటార్డ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ గారూ!  మీ నుంచి నేనేం సహాయం పొందానో చెప్పాలి? డబ్బులిచ్చారా? పోనీ సినిమాల్లో వేషాలిచ్చారా? అని ప్రశ్నించి, తాను స్వయంకృషితో ఎదిగాననీ, ఎవరి నుంచీ సహాయం పొందలేదనీ చెప్పుకున్నారు అలీ. సరే అందతా వేరే విషయం. అలీ జగన్ గూటికి చేరారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న అలీకి 2019 ఎన్నికలలో పోటీకి అవకాశం ఇవ్వకుండా చేయిచ్చారు జగన్. అయితే మంచి పదవి ఇస్తానంటూ ఐదేళ్ల పాటు అలీని ఆశల పల్లకీలో ఊరేగించారు. మధ్యలో ఒకటి రెండు సార్లు జగన్ అలీని తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని మరీ పదవిపై హామీని పునరుద్ఘాటించారు. ఆ రెండు సందర్భాలలోనూ సినీ పరిశ్రమ విషయంలో పంచాయతీ జరుగుతున్న సమయమే కావడం విశేషం.  సరే చివరికి ఆలీ ఆశించినంత పెద్ద పదవి కాకపోయినా.. కంటి తుడుపు చర్యగా ఓ సలహాదారు పదవి ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు జగన్. అయితే 2024 ఎన్నికలలో   అలీ పోటీ షూర్ అంటూ వైసీపీ నుంచి పలు లీకులు వచ్చాయి. ఆయన పోటీ చేసే నియోజకవర్గం కూడా తెరమీదకు వచ్చింది. తీరా జగన్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించాకా చూస్తే అలీ మళ్లీ కాట్రవల్లీయే అయిపోయారు.  ఇప్పటికి తత్వం బోధపడిందో ఏమో.. అలీ రాజకీయ యవనికపై ఎక్కడా కనిపించడం లేదు. వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొనడం లేదు.  ఈ మధ్యే ఓ టీవీ చానల్ లో ఆయన నిర్వహించే అలీతో సరదాగా అన్న కార్యక్రమంలో నటుడు శివాజీని ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంగా శివాజీ అలీకి రాజకీయాల జోలికి మాత్రం పోకు. ఒక వేళ పోయినా ఎన్నికలలో పోటీ మాత్రం చేయకు అంటూ ఓ సలహా పారేశారు. చూస్తుంటే అలీ ఆ సలహాను తుచ తప్పకుండా పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. 
Publish Date: Apr 25, 2024 10:11AM

యాపిల్ సైడర్ వెనిగర్ గురించి ఈ విషయాలు తెలుసా?

రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదన్నది చాలా పాపులర్ అయిన మాట. యాపిల్ లో ఉండే పోషకాలే దీనికి కారణం. అయితే ఈ మధ్య యాపిల్ సైడర్ వెనిగర్ కూడా బాగా పాపులర్ అయింది. దీన్ని తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది.  ఎవరైనా కొత్తగా యాపిల్ సైడర్ వెనిగర్ వాడే ఆలోచనలో ఉన్నా, దీని గురించి పూర్తీగా తెలియకున్నా ... దీని గురించి తప్పక తెలుసుకుని వాడాలి. యాపిల్ సైడర్ వెనిగర్ వాడటానికి ముందు అందరూ తెలుసుకోవలసిన విషయాలేంటో.. దీన్ని వాడటం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. మధుమేహ రోగులకు.. యాపిల్ సైడర్ వెనిగర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల మధుమేహం నుంచి ఉపశమనం లభిస్తుంది.  మధుమేహం ఉన్నవారు యాపిల్ సైడర్ వెనిగర్ ను వైద్యుల సలహా తీసుకుంటే రెగ్యులర్ గా వాడుతూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. బరువు.. యాపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గాలని అనుకునేవారికి  ఔషధం కంటే తక్కువ కాదు. దీన్ని రోజువారీ వాడుతుంటే  ఆకలి నియంత్రణలో ఉంటుంది.  ఇది అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.   ఎక్కువసేపు కడుపు నిండిన ఫీల్ ఇస్తుంది. గుండె ఆరోగ్యం.. చెడు కొలెస్ట్రాల్ సమస్య అయినా,  రక్తపోటును నియంత్రించడం అయినా..  ఆపిల్ సైడర్ వెనిగర్ సమర్థవంతంగా పనిచేస్తుంది. గుండెకు సంబంధించిన చాలా  సమస్యలలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.   ఇందులో ఉండే మూలకాలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చర్మ ఆరోగ్యం.. యాపిల్ సైడర్ వెనిగర్ చర్మం pH స్థాయిని నిర్వహించడానికి  ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాకుండా చర్మం  దురద, ఎరుపు,  చర్మ అంటువ్యాధులు మొదలైన  సమస్యలలో  బ్యాక్టీరియాను చంపడంలో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఎలా తీసుకోవాలి.. యాపిల్ సైడర్ వెనిగర్ వినియోగించడానికి ఒక కరెక్ట్ కొలత వాడాలి. ప్రతిరోజూ ఇంతే మోతాదులో తీసుకోవాలి.  5-10 ml మోతాదుతో మాత్రమే ప్రారంభించాలి.  ఒక గ్లాసు తీసుకుని అందులో 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేయాలి. గ్లాసు నిండుగా నీరు తీసుకోవాలి.  దీన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో  తాగాలి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలు,  చిగుళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.  కాబట్టి దీన్ని మొదలుపెట్టే ముందు   వైద్యుడిని సంప్రదించడం మంచిది.                                         *రూపశ్రీ.  
Publish Date: Apr 25, 2024 10:10AM

కూటమికే యువత జై!

వైసీపీ గెలుపు ఆశలు రోజు రోజుకూ ఆవిరైపోతున్నాయి. బటన్ నొక్కి పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును పంచడం మాత్రమే పాలన అనుకుని ఐదేళ్లుగా అదే చేస్తూ వచ్చిన జగన్ సర్కార్ కు యువత షాక్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును ఎన్నికలలో ఓట్ల కోసం ఉచిత పందేరం చేసే హక్కు, అధికారం జగన్ కు ఎక్కడిదని యువత నిలదీస్తున్నారు. ఉపాధి, ఉద్యోగ కల్పన గురించి పట్టించుకోకుండా.. అధికార పగ్గాలు అందుకున్న క్షణం నుంచీ మరో సారి అధికారం కోసం ఉచిత పందేరాలే శరణ్యం అంటూ సాగిన జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలోనూ అధమ స్థానానికి చేరిన వైనాన్ని యువత గుర్తించారు. ఉద్యోగం, ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు వలస వెళ్లాల్సిన అవసరం మాకేంటి అంటూ జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు ఢోకా ఉండదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే మా మద్దతు తెలుగుదేశం కూటమికే నంటూ జై కొడుతున్నారు.  మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తేనే  రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయన్న నమ్మకం ఉందంటున్నది ఏపీ యువత.   మరీ ముఖ్యంగా తాజాగా నమోదైన కొత్త ఓటర్లయితే.. ఐదేళ్ల పాలనలో జరిగిన అవకతవకలు చాలు. ఇక అనుభవజ్ణుడైన చంద్రబాబుకే మా మద్దతు అంటున్నారు. ఇలా ఈ సారి ఎన్నికలలో తొలి సారి ఓటు వేయడానికి తమ ఓటు నమోదు చేయించుకున్న వారి సంఖ్య కోటీ పదిలక్షల పైనేనన్నది ఓ అంచనా.   గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, అనేక కంపెనీలు ఏపీకి తరలివచ్చాయి. దానికోసం ఆయన  ఎంతో కృషి చేశారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన సందర్భంలో ఆయన కోసం దేశ విదేశాల్లోని తెలుగు వారంతా కదిలిన వైనాన్ని చూపుతూ ఆయన విధానాలు వేలాది, లక్షలాది మందికి ఐటీలో ఉన్నతోద్యోగాలు వచ్చేలా చేశాయని చెబుతున్నారు. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన హయంలో విశాఖ, విజయవాడ, మంగళగిరి, కర్నూలు, అనంతపురం వంటి ప్రాంతాల్లో జాతీయ-అంతర్జాతీయ పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ఫలితంగా ఉత్తరాంధ్ర-కోస్తా నిరుద్యోగ యువకులకు, బయట రాష్ట్రాలకు వెళ్లే పని లేకుండా పోయిందని చెబుతున్నారు.   అయితే  వైసీపీ  అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ విధానాల కారణంగా చంద్రబాబు హయాంలో వచ్చిన కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా పక్క రాష్ట్రాలకు తరలిపోయిన సంగతిని యువత ప్రముఖంగా ప్రస్తావిస్తూ తమ మద్దతు చంద్రబాబుకే. తెలుగుదేశం కూటమికే అని నిర్ద్వంద్వంగా చెబుతున్నారు.    
Publish Date: Apr 25, 2024 9:41AM

ఖ‌మ్మం లోక్ సభ అభ్య‌ర్థిగా పొంగులేటి వియ్యంకుడు.. కాంగ్రెస్ వ్యూహం ఫ‌లిస్తుందా?

ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ అభ్య‌ర్థిపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్  హ‌వా కొన‌సాగింది. లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ ఖ‌మ్మంలో విజ‌యం సాధించేలా పార్టీ అధిష్టానం అభ్య‌ర్థి ఎంపిక‌లో పెద్ద క‌స‌ర‌త్తే చేసింది. ఈ క్ర‌మంలో ప‌లువురు పేర్ల‌ను అధిష్టానం ప‌రిశీలించింది. అనేక రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని చివ‌ర‌కు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి వియ్యంకుడు రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డికి అధిష్టానం టికెట్ ఇచ్చింది. త‌ద్వారా పార్ల‌మెంట్ ప‌రిధిలోని రెండు బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాల ఓట‌ర్ల‌ను ఒకే గొడుగు కింద‌కు తీసుకొచ్చేలా కాంగ్రెస్ వ్యూహం రచించిందని జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.    తెలంగాణ‌లో మొత్తం 17లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ఈ ఎన్నిక‌ల్లో 12 నుంచి 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగుర‌వేయాల‌ని పార్టీ అధిష్టానం ప‌ట్టుద‌ల‌తో ఉంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో అభ్య‌ర్థుల విజ‌యంకోసం కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు. అయితే  ఖ‌మ్మం, క‌రీంన‌గ‌ర్‌, హైద‌రాబాద్ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల ఎంపిక‌పై అధిష్టానం త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డింది. గురువారంతో నామినేష‌న్ల గ‌డువు ముగుస్తుండ‌టంతో బుధ‌వారం రాత్రి  మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌రిలో నిలిచే అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించింది. ఖమ్మం  లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచల రాజేందర్ రావు, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మహ్మద్ వలీవుల్లా సమీర్ పేర్లను అధిష్టానం అధికారికంగా ప్ర‌క‌టించింది. ముఖ్యంగా ఖ‌మ్మం లోక్ సభ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థి ఎంపిక‌పై కాంగ్రెస్ అధిష్టానం భారీ  క‌స‌ర‌త్తే చేసింది. ఈ క్ర‌మంలో ప‌లువురి పేర్లు ప‌రిశీలించింది. జిల్లాలోని పార్టీ ముఖ్య‌నేత‌ల నుంచి అభిప్రాయాలు సేక‌రించిన అధిష్టానం.. మెజార్టీ అభిప్రాయాల మేర‌కు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి వియ్యంకుడు రామ స‌హాయం ర‌ఘురాంరెడ్డి పేరు ఖరారుచేసింది. ఖ‌మ్మం పార్ల‌మెంట్ సీటును త‌మ అనుచ‌రుల‌కే ద‌క్కేలా జిల్లాలోని ముగ్గురు మంత్రులు పోటీ ప‌డ్డారు. అయితే, సామాజిక వ‌ర్గాల వారీగా లెక్క‌ల‌ను బేరీజు వేసుకొని అధిష్టానం చివ‌రికి  పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి వియ్యంకుడు ర‌ఘురామిరెడ్డి పేరును అధిష్టానం  ఖరారు చేసి అధికారికంగా ప్ర‌క‌టించింది. రామ స‌హాయం రఘురామి రెడ్డికి రాజకీయ పలుకుబడి గట్టిగానే ఉంది. ఆర్థికంగానూ బ‌ల‌మైన వ్య‌క్తి. గ‌తంలో మహబూబాబాద్ లోక్‌సభ స్థానానికి రఘురామి రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి నాలుగుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆయ‌నకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డేకాక‌..  సినీ హీరో విక్టరీ వెంకటేశ్ కూడా   వియ్యంకుడే. హీరో వెంక‌టేశ్ కుమార్తె అశ్రిత‌ను ఆయ‌న పెద్ద కుమారుడు వినాయ‌క్ రెడ్డి వివాహం చేసుకోగా.. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కుమార్తె స్వ‌ప్నిరెడ్డిని ఆయ‌న చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి వివాహం చేసుకున్నాడు. అయితే  ఖ‌మ్మం లోక్‌స‌భ‌ సిట్టింగ్ ఎంపీగా బీఆర్ ఎస్‌ నేత నామా నాగేశ్వ‌ర‌రావు ఉన్నారు. మ‌రోసారి బీఆర్ ఎస్ అధిష్టానం ఆయ‌న‌కే టికెట్ ఇచ్చింది. నామా నాగేశ్వ‌ర‌రావు క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. రాష్ట్రంలో ప‌దిహేడు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ అధిష్టానం తొలుత ప్ర‌క‌టించిన 14 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ క‌మ్మ సామాజిక వ‌ర్గానికి  అవ‌కాశం ద‌క్క‌లేదు. దీంతో, ఖ‌మ్మం నుంచి అవ‌కాశం ద‌క్కుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, కాంగ్రెస్  అధిష్టానం మాత్రం రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తికే  టికెట్‌ కేటాయించింది. రామ‌స‌హాయంకు టికెట్ కేటాయించ‌డం వెనుక కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు జిల్లా రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.  ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్ర‌ధాన పార్టీలు క‌మ్మ సామాజిక వ‌ర్గం వ్య‌క్తికే టికెట్ కేటాయిస్తూ వ‌స్తున్నాయి. బీఆర్ ఎస్ పార్టీ అధిష్టానం అదే విధానాన్ని కొన‌సాగిస్తూ నామా నాగేశ్వ‌ర‌రావునే మ‌రోసారి అభ్య‌ర్థిగా బ‌రిలోకి దింపింది. ఖ‌మ్మంలో  తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల‌కు బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం అభిమానులు కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిచారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో వారు నామావైపు మొగ్గుచూపే అవ‌కాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో నామాకు గ‌ట్టిపోటీ ఇచ్చేలా మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావును బ‌రిలోకి దింపాల‌ని  కాంగ్రెస్ అధిష్టానం ఒక దశలో భావించింది.  అయితే స్థానికేతరుడు అన్న అభ్యంతరాలు స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి వ్య‌క్తి కావడంతో  అధిష్టానం మండ‌వ పేరును ప‌క్క‌న పెట్టింది. నామాను ఢీకొట్టేందుకు కమ్మ సామాజిక వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో బ‌ల‌మైన నేత లేక‌పోవ‌టంతో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి   వియ్యంకుడు అయిన రామ స‌హాయం ర‌ఘురామిరెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఫైన‌ల్ చేసింది. రామ స‌హాయంకు విక్ట‌రీ వెంక‌టేశ్ కుటుంబంతో బంధుత్వం ఉండ‌టంతో ఖ‌మ్మం పార్ల‌మెంట్ ప‌రిధిలో రెండు బ‌ల‌మైన‌ సామాజిక  వ‌ర్గాల ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంటుంద‌ని అధిష్ఠానం భావించినట్లు కనిపిస్తోంది.   కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం ఏమేర‌కు ఫ‌లిస్తుందో వేచి చూడాల్సిందే.
Publish Date: Apr 25, 2024 9:14AM