కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్

 

టీఆర్ఎస్ నేత, ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటారు. ట్వీట్లతో చురకలంటిచడంలో దిట్ట. తాజాగా ఆయన ప్రజాకూటమిపై ట్విట్టర్ లో తనదైన శైలిలో స్పందించారు.  కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న ఫొటోను ట్యాగ్ చేస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. రాహుల్, చంద్రబాబులు సీట్లలో కూర్చుంటే వెనకే ఉత్తమ్ కుమార్ నిల్చొని ఉన్నారు. ఒకవేళ ప్రజాకూటమికి ఓటేస్తే తెలంగాణ భవిష్యత్ కూడా ఇలాగే ఉంటుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవం, వెన్నెముక లేని తెలంగాణ ‘స్కాంగ్రెస్’ నేతలు సిగ్గుపడాలని విమర్శించారు. 

అంతకుముందు తెలంగాణలో పొలిటికల్ సీజన్ నడుస్తోందని.. జాతీయస్థాయి నాయకులు చీమల్లా బారులు తీరారని మరో ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, చంద్రబాబు పొలిటికల్ టూరిస్టులన్న ఆయన.. వాళ్లు వచ్చి వెళతారని.. కేసీఆర్ మాత్రం ఇక్కడే ఉంటారని పంచ్ వేశారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిర్వహించేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్, ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబులు ఇక్కడకు వచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని ఉద్దేశించే కేటీఆర్ ట్వీట్ చేశారు.