సంక్రాంతి చెప్పే పాఠాలెన్నో..

 

తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. పేదాధనికా బేధం లేకుండా, కులాల ప్రస్తావన రాకుండా ఊరూవాడా ఏకమై జీవితమే ఒక వేడుక అన్నంత గొప్పగా సాగే పండుగ ఇది. ఏదో ఒక దేవత కోసం కాకుండా చేతికి పంటలు అందివచ్చే పంటల పండుగగా సాగే ఈ సంప్రదాయం వెనుక పెద్దలు చెప్పకుండానే చెప్పే జీవితపాఠాలు ఎన్నో...

మార్పుకి స్వాగతం

సూర్యుడి గమనం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరలేందుకు సూచనగా సాగే పండుగ సంక్రాంతి. అందుకే ఈ పండుగ ఒక్కదాన్నే మనం తిథుల ప్రకారం కాకుండా సౌరమానం ప్రకారం జరుపుకుంటాం. జీవితంలో ఇప్పటివరకూ జరిగిన కీడుని మర్చిపోయి, కొత్త జీవితానికి నాంది పలకడమే ఈ పండుగ పరమార్థంగా తోస్తుంది. అందుకే దక్షిణాయం చివరి రోజైన భోగినాడు వేసుకునే భోగిమంటలు మన జీవితంలోని చేదు అనుభవాల దహనానికి సూచనగా భావిస్తారు.

అనుబంధాలు

సంక్రాంతి వచ్చిందంటే చాలు, నగరాలన్నీ ఖాళీ అయిపోతాయి. ప్రతి మనిషీ తన మూలాలను వెతుక్కుంటూ పల్లెల వైపుగా పయనమవుతాడు. కొత్త అల్లుడిని పిలవాలంటే సంక్రాంతే పెద్ద పండుగ. బంధువులంతా ఒక్క చోటకి చేరాలంటే సంక్రాంతే ముఖ్యమైన వేడుక. అలా మన మూలాలను గుర్తుచేస్తూ అనుబంధాలను దృఢపరుస్తూ సాగే పెద్ద పండుగ సంక్రాంతే!

తొటి జీవులకు మర్యాద

మిగతా పండుగల తీరేమో కానీ సంక్రాంతి సందర్భంలో మాత్రం మన చుట్టూ ఉన్న ప్రతి జీవికీ ప్రధాన్యతని ఇవ్వడం కనిపిస్తుంది. కనుమ రోజున పశువులని పూజించి వాటికి కృతజ్ఞత చెప్పుకోవడం, పక్షులకి ధాన్యపు గింజలు అందేలా ధాన్యపుకంకులను వేలాడదీయడం, ఉడతల వంటి జీవులకు బియ్యపు పిండి అందేలా ముగ్గులు వేయడం... ఇలా ప్రకృతిలోని మిగతా జీవులకి సమప్రాధాన్యత ఇవ్వడం ఈ సందర్భంలో కనిపిస్తుంది.

నలుగురితో పంచుకోవడం

సంక్రాంతినాడు రైతుల ఇళ్లకి ధాన్యరాశులు సమృద్ధిగా చేరుకుంటాయి. ఇదే సమయంలో వారి నుంచి సాయాన్ని పొందేందుకు గంగిరెద్దులవారు, హరిదాసులవారు తిరుగుతుంటారు. గంగిరెద్దు సాక్షాత్తూ శివుని వాహనమైన నంది అవతారం అనీ, ఇక హరిదాసుల తల మీద ఉండే భిక్షాపాత్రని ఆ కృష్ణుడే ప్రసాదించాడనీ నమ్మకం. అదేమో కానీ మన చెంతకి కాస్త సంపద చేకూరే సమయంలో దానిని ఇతరులతో పంచుకోవడం ఈ సంప్రదాయాల వెనక సూచనగా గోచరిస్తుంది.

గాలిపటంలా

ఆకాశంలోకి ఎగరవేసిన గాలిపటం, స్వేచ్ఛావిహంగంలా ఎగురుతుంది. మనిషి నేల మీదే ఉండవచ్చుగాక! కానీ అతని మనసు ఎలాంటి ప్రతిబంధకాలూ లేకుండా స్వేచ్ఛగా విహరించాలనే ఆంతర్యం ఇందులో కనిపిస్తుంది. తన ఊహలకు రెక్కలిమ్మని ప్రోత్సహిస్తుంది. జీవితమనే గాలిపటం ఎలాంటి చిక్కుముడులూ లేకుండా, వీలైనంత ఎత్తులకు ఎగిసేలా చేసే నేర్పుని సాధించమనీ సూచిస్తుంది.

ఇక మనిషిలోని సృజన వెలికితీయాలని చెప్పే ముగ్గులూ, బద్ధకాన్ని హరించాలంటూ సూచించే భోగిమంటలూ, రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా గమనించుకోవాలని చెప్పే బియ్యపు పిండివంటలూ, పెద్దలను సదా గర్తుంచుకోవాలని తెలియచేసే తర్పణాలూ, ఏ కాలంలో దొరికే ఫలానికైనా విలువనివ్వాలని చెప్పే రేగుపండ్లూ... అబ్బో చెప్పుకుంటూ పోతే సంక్రాంతి వెనుక ఉండే ప్రతి సంప్రదాయం వెనుకా ఏదో ఒక ఆంతర్యం కనిపించక మానదు.

- నిర్జర.