కాదేది రాజకీయలకనర్హం

 

కుక్కపిల్లా, సబ్బు బిళ్ళా, అగ్గి పుల్లా కాదేది కవితకనర్హం అని మహానుభావుడు శ్రీశ్రీ ఏ ఉద్దేశ్యంతో అన్నారో గానీ, అవి శిలాక్షరాలయిపోయాయి. ఈ రోజు మన రాజకీయపార్టీలకి రాజకీయం చేయడానికి అనర్హమయినవంటూ ఏవీ లేవు. దిల్ షుక్ నగర్ బాంబు దాడులలో గాయపడిన వారు వారికి రాజకీయ పావులే, దేశ ప్రతిష్టకు సంబంధించిన ఇటలీ నావికుల కేసు రాజకీయ చదరంగం ఆడుకోవడానికి అర్హమయినదే.

 

అటువంటిది, ఇటీవల సుప్రీం కోర్టు బాలివుడ్ నటుడు సంజయ్ దత్త్ కు 5 ఏళ్ల జైలు శిక్ష విదిస్తూ ఇచ్చిన తీర్పు మాత్రం రాజకీయానికి ఎందుకు పనికిరాదు? కాంగ్రెస్ పార్టీ సంజయ్ దత్త్ ను క్షమించవచ్చునని వాదన మొదలు పెట్టగానే అంతవరకు మాట్లాడని బీజేపీ ముంబై దాడులలో మరణించిన వారిపై చూపని జాలి, కరుణ కేవలం సంజయ్ దత్త్ పైనే ఎందుకు చూపవలసి వస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసింది. సంజయ్ దత్త్ ని క్షమిస్తే ఇక ముందు ఇదొక సంప్రదాయంగా మారుతుందని వాదించింది. సంజయ్ దత్త్ క్షమార్హుడు కాదని గట్టిగా వాదిస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీల మద్య ఈ విధంగా యుద్ధం సాగుతుంటే, మరో వైపు మహారాష్ట్రలో కూడా సంజయ్ దత్త్ కి క్షమాబిక్ష పెట్టడం గురించి అక్కడి శాసన సభలో పెద్ద యుద్ధమే జరుగుతోందిప్పుడు.

 

మహారాష్ట్రలో ఒకవైపు బీజేపీ, శివసేనలు సంజయ్ దత్త్ కు వ్యతిరేఖంగా వాదిస్తుంటే, శివసేన నుండి విడిపోయి మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అనే వేరు కుంపటి పెట్టుకొన్నరాజ్ థాకరే శివసేనను వ్యతిరేఖించాలి గనుక కాంగ్రెస్ పార్టీతో కలిసి సంజయ్ దత్త్ కు అనుకూలంగా వాదిస్తున్నారు. ఈ రాజకీయాలు చూస్తున్న సంజయ్ దత్త్ ఇక ఈ కంపు భరించడం కంటే ఆ జైలు జీవితమే మేలని భావించి తానే స్వయంగా జైలులోకి వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదు.