“తెలంగాణా కోసం 101 అబద్ధాలు”

 

ఈ రోజు ప్రధాని మాజీ సలహాదారు డా.సంజయ్ బారు డిల్లీలో విశాలాంధ్ర వారు నిర్వహించిన ఒక పుస్తకా విష్కరణ సభలో పాల్గొన్నారు. యన్. చక్రవర్తి రచించిన ఆ పుస్తకం పేరు “తెలంగాణా కోసం 101 అబద్ధాలు, అర్ధరహిత వాదనలు.” ఆ పుస్తకంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన తెలంగాణావాదులు, తెలంగాణాకు చెందిన సంజయ్ బారు ఆ సభలో పాల్గొనడంపై మరింత ఆగ్రహంతో ఉన్నారు.

 

పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న సంజయ్ బారు మాట్లాడుతూ, తనని ఆ సభలో పాల్గొనవద్దని హెచ్చరిస్తూ తనకు అనేక ఈ మెయిల్స్ వచ్చినట్లు తెలిపారు. అయినా కూడా వ్యక్తుల భావప్రకటన స్వేచ్చను గౌరవిస్తున్న కారణంగా అయన ఈ సభకు హాజరయినట్లు తెలిపారు. పుస్తకంలో వివిధ అంశాలతో తానూ పూర్తిగా ఏకీభవించకపోయినా, పూర్తిగా నిరాకరించడం లేదని ఆయన అన్నారు. తెలంగాణా ప్రజలలో రాష్ట్రం ఏర్పడాలనే బలమయిన కాంక్ష ఉందని పేర్కొంటూనే కేవలం సెంటిమెంటు కారణంగానే రాష్ట్రాలు విభజించుకుపోవడం మంచిదికాదని అయన అన్నారు.

 

వెనకబాటుతనం, నీటి సమస్యల గురించి ప్రస్తావిస్తూ దానికి కారణం రాష్ట్రాన్ని పరిపాలించిన మంత్రులు, ముఖ్యమంత్రులదే బాధ్యత అన్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల నుండి కూడా మంత్రులు, ముఖ్య మంత్రులు పాలన చేసినా వారి నిర్లక్ష్యం, అలసత్వం కారణంగానే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు వెనకబడిపోయున్నాయని అయన అన్నారు. అందువల్ల, కొత్త రాష్ట్రాల ఏర్పాటు కన్నా, రాష్ట్రాభివృద్దే ముఖ్యమని అయన అన్నారు. తమవల్లే హైదరాబాదు అభివృద్ధి చెందిందని వాదించే వారిని విమర్శిస్తూ ముంబై, గుజరాత్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత, హైదరాబాదులో భారీ ప్రభుత్వ సంస్థల స్థాపన జరగడంవల్లనే అందరూ హైదరాబాదు వైపు ఆకర్షితులయ్యి చిన్న పరిశ్రమల స్థాపనకు దోహదపడ్డారని అయన అన్నారు.

 

అటు ఆంధ్రాలోనూ ఇటు తెలంగాణాలోను వ్యాపించి ఉన్న తమ కుటుంబం రెండు ప్రాంతాల మద్య వారధి వంటిది కనుక, తానూ నిర్ద్వందంగా మాట్లాడేందుకు అన్ని విధాల అర్హుడినని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన సమస్యపై సలహా ఇచ్చేందుకు నియమించిన జస్టిస్ శ్రీ కృష్ణా కమిటీ సర్వోతమయిన సూచనలు చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.