హైదరాబాద్‌లో శానిటేషన్‌ డ్రైవ్‌.. కొవిడ్ అల‌ర్ట్‌..

మ‌ళ్లీ మునుప‌టి రోజులు వ‌స్తున్నాయి. ఒక్క లాక్‌డౌన్ మిన‌హా గ‌తంలో తీసుకున్న చ‌ర్య‌ల‌న్నీ మ‌ళ్లీ మొద‌లుపెట్టేశారు. క‌రోనా విజృంభిస్తున్న వేళ‌.. హైద‌రాబాద్‌లో శానిటేష‌న్ కార్య‌క్ర‌మం పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. వైర‌స్ నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా న‌గ‌రంలో జీహెచ్ఎమ్‌సీ స్పెష‌ల్ శానిటేష‌న్ డ్రైవ్ చేప‌ట్టింది. రద్దీగా ఉండే రహదారుల వెంట డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని చల్లుతున్నారు.

డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది ప్రత్యేకమైన ట్యాంకర్ల ద్వారా ఈ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. వైరస్‌ గాల్లో కూడా వ్యాపిస్తున్నట్టు తేలడంతో రద్దీ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున‌ శానిటేష‌న్‌ కార్యక్రమం న‌డుస్తోంది. 

జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులతో రద్దీగా మారుతున్నాయి. తెలంగాణ‌లో గత కొన్ని రోజులుగా రెండో దశ కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు 83,089 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 4,009 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,55,433కి చేరింది. రాష్ట్రంలో ఒక్కరోజే మహమ్మారి కారణంగా 14మంది మృత్యువాతపడ్డారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,838కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ‌లో 39,154 యాక్టివ్‌ కేసులున్నాయి.