రాజీనామాలు రాష్ట్రపతి పాలనకి ఆహ్వానమా

 

మెల్లగా రాజుకొన్న సమైక్య ఉద్యమం ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలని తాకుతోంది. ఊహించినట్లుగానే సమైక్యాంధ్ర ఉద్యమ సెగలు తెదేపాను కూడా తాకాయి. ఇంత కాలం చంద్రబాబు అతికష్టం మీద పార్టీ నేతలను కట్టడిచేసి ఉంచినప్పటికీ, రోజురోజుకి తీవ్రతరమవుతున్నఉద్యమం నుండి తప్పించుకోవడం వారి వల్లకాలేదు.

 

పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, ప్రభాకర్ రావు, రఘునాథ రెడ్డి, శ్రీరామ్ తాతయ్య, అబ్దుల్ ఘని, ప్రత్తిపాటి పుల్లారావు, శ్రీదర్, నరేంద్ర, ఆనంద బాబు, పార్థ సారధి, కేవీ వెంకట ప్రసాద్, దేవినేని ఉమ తదితరులు రాజీనామాలు చేసారు. వీరు గాక పార్టీకి చెందిన అనేక మంది యంయల్సీలు కూడా రాజీనామాలు చేస్తున్నారు. బహుశః రేపటికి అన్ని రాజకీయ పార్టీలు దాదాపు ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే, కాంగ్రెస్ చెందిన అనేక మంది మంత్రులు, శాసన సభ్యులు, యంయల్సీలు తమ రాజీనామాలు సమర్పించారు.

 

ఇక ప్రస్తుతం సీమంధ్ర ప్రాంతానికి చెందిన పల్లంరాజు, కావూరి, చిరంజీవి, పురందేశ్వరి, శీలం తదితర కేంద్ర మంత్రులు డిల్లీలో కేవీపీ రామచంద్ర రావు ఇంట్లో సమావేశమయ్యారు. వారు కూడా రాజీనామాలు చేయాలనే ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే సమైక్య ఉద్యమం పరాకాష్టకు చేరుకోన్నట్లే భావించవచ్చును.

 

అయితే, తమ రాజీనామాల వలన కేంద్ర నిర్ణయం మారదని వారందరికీ తెలిసినప్పటికీ వారు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారంటే, రాజ్యంగ సంక్షోభం సృష్టిండం ద్వారా రాష్ట్రంపై రాష్ట్రపతి పాలన విదించబడితే, రాజధాని హైదరాబాద్ పై ప్రస్తుతం తెలంగాణా నేతలు చేస్తున్న వాదనలకు అడ్డు కట్ట వేయవచ్చునని వారి ఆలోచన కావచ్చును. హైదరాబాద్ ను ఎట్టిపరిస్థితుల్లో వదులుకొనేందుకు రెండు ప్రాంతాల వారు ఇష్టపడని కారణంగా మధ్యే మార్గంగా హైదరాబాదుని కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు ఈ రాజీనామాల ద్వారా ఒత్తిడి తేవచ్చునని వారి ఆలోచన కావచ్చును.

 

రాష్ట్ర విభజనపై ఎంతో లోతుగా అధ్యయనం చేసి అనేక మందితో సంప్రదింపులు జరిపిన తరువాతనే నిర్ణయం ప్రకటించామని కొద్ది సేపటి క్రితమే దిగ్విజయ్ సింగ్ మీడియాతో చెప్పారు. అయితే, కాంగ్రెస్ అంచనాలకు విరుద్దంగా సమైక్యాంధ్ర ఉద్యమం మళ్ళీ పుంజుకొంది. కాంగ్రెస్ హైదరాబాదు పై ఉన్న పీటముడులను గమనించి కేంద్రపాలిత ప్రాంతంగా ముందే ప్రకటించి ఉంటే బహుశః ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. నానాటికి తీవ్రమవుతున్న ఉద్యమానికి బహుశః అదొక్కటే పరిష్కారం అవుతుందేమో!