సమైక్య జంతర్ మంతర్ పనిచేస్తుందా

 

కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, యంయల్సీలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఈనెల 13న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చెప్పటనున్నారు. అయితే, కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గేదిలేదని ఖరాఖండిగా చెపుతున్ననేపధ్యంలో వారి నిరసన దీక్షలు ఏమయినా ప్రభావం చూపగలవా? అనే ధర్మసందేహానికి మంత్రి శైలజానాథ్ జవాబు చెపుతూ, “ఇక చర్చలే లేవని తేల్చి చెప్పిన కాంగ్రెస్ అధిష్టానాన్నితమ ఒత్తిడితో ఇప్పుడు ఆంటోనీ కమిటీ పేరిట చర్చలకు ఒప్పించగలిగామని, అదే విధంగా ఆఖరి నిమిషం వరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పారు. సమైక్యాంధ్ర కోరుకొంటున్న నేతలందరూ 12వ తేదీ సాయంత్రానికల్లా డిల్లీ చేరుకొని 13న జరిగే నిరసన దీక్షలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

 

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తధ్యమని ఒకసారి, ఆంటోనీ కమిటీకి నిర్దిష్ట వ్యవధి ఏదీ లేదని మరొకసారి చెపుతూ రెండు ప్రాంతాల ప్రజలలో గందరగోళం సృష్టిస్తున్నదిగ్విజయ్ సింగ్ పై సీమాంధ్ర నేతలు ప్రయోగించనున్నఈ సమైక్య జంతర్ మంతర్ పనిచేస్తుందా? లేదా? లేక కొద్ది రోజుల క్రితం టీ-కాంగ్రెస్ నేతల చేత తెలంగాణా సాధన సభ పెట్టించి పదిరోజులోనే చాలా నాటకీయంగా నరేంద్ర మోడీ సభకు ముందుగానే తెలంగాణా ప్రకటించేసి, తెలంగాణపై మోడీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేసి చేతులు దులుపుకొన్న కాంగ్రెస్ అధిష్టానం, నేడు మోడీ సభ ముగిసిపోతుంది గనుక ఇప్పుడు సీమంద్రాలో తన పార్టీని కాపాడుకొనేందుకు మళ్ళీ తన తెలంగాణా నేతల మీద ఈ జంతర్ మంతర్ ని ప్రయోగిస్తోందా? లేక సమైక్యవాదులు నిజంగానే కాంగ్రెస్ అధిష్టానం మీద ఈ జంతర్ మంతర్ ను ప్రయోగిస్తున్నారా? తెలుసుకోవాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.