చోద్యం చూస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

 

కేంద్రం రాష్ట్ర విభజన ప్రకటన చేసినప్పటి నుండీ నానాటికి సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రతరమవుతోంది. ఇదివరకు తెలంగాణా ఉద్యమాలతో అల్లకల్లోలంగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు సమైక్య ఉద్యమాలతో మళ్ళీ అదే పరిస్థితికి చేరుకొంది. అయితే, ఒక దశ దిశా లేకుండా సాగుతున్న ఈ ఉద్యమాలకు అసలు ముగింపు ఎప్పుడో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే రాష్ట్ర విభజనపై ఇక ఎంత మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని కాంగ్రెస్ అధిష్టానం ఖచ్చితంగా చెపుతోంది. అంతే కాకుండా రాష్ట్ర విభజన ప్రక్రియను కూడా మొదలుపెట్టేసింది. ప్రస్తుతం హోంశాఖ రాష్ట్ర విభజన, హైదరబాద్ ఉమ్మడి రాజధాని అనే రెండు అంశాలపై ఒక నోట్ తయారుచేస్తోంది. దానిని కేంద్ర క్యాబినెట్ ఆమోదించడంతో విభజన ప్రక్రియ జోరందుకొంటుంది. అయితే, రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దడానికి కాంగ్రెస్ ఎంత మాత్రం ప్రయత్నించక పోవడంతో ఉద్యమం నానాటికి తీవ్ర తరం అవుతోంది. మొదట అనంతపురంలో మొదలయిన ఈ సమైక్యాంధ్ర ఇప్పుడు సీమంధ్ర జిల్లాలంతటికీ వ్యాపించడంతో జన జీవనం అస్తవ్యస్తమయిపోయింది. సమైక్యాంధ్ర కోసం కూడా ఆత్మహత్యలు మొదలవడం చాలా విచారకరం. అయితే వాటిని నిలువరించే ప్రయత్నం ఎవరూ చేయకపోవడం వల్ల అవి కూడా క్రమంగా పెరుగుతున్నాయి. నేటికి దాదాపు 26వరకు చనిపోయినట్లు సమాచారం. రాష్ట్రంలో ఒకవైపు వరద భీభత్సంతో ప్రజలు నానా బాధలు పడుతుంటే, ఈ సమైక్యాంధ్ర ఉద్యమాల వల్ల ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూతపడుతుండటంతో వరదలలో చిక్కుకొన్న ప్రజలకి సహాయం అందక నానా బాధలు పడుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితి నానాటికి దిగజారుతున్నపటికీ, ముఖ్యమంత్రి గానీ, ఇతర మంత్రులు గానీ ఏమాత్రం చొరవ తీసుకొనే ఆలోచనలో లేరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తూ పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. ఈ పరిస్తిత్కి ప్రజలను తప్పు పట్టడం కంటే, చోద్యం చూస్తూ కూర్చొన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే ముందుగా తప్పు పట్టవలసి ఉంటుంది.