జమ్మూలో హైదరాబాద్ యువకుడు అరెస్ట్

 

హైదరాబాదు బాంబు ప్రేలుళ్ళు జరిగి ఇప్పటికి సరిగా వారం రోజులయినప్పటికీ, పోలీసులకు ఎటువంటి కీలక ఆధారం దొరకలేదు. ఒకవేళ దొరికినా అటువంటి సమాచారాన్ని మీడియాకు బహిర్గతం చేయడం అవివేకం అవుతుంది గనుక, దర్యాప్తు బృందాలు కీలక ప్రకటన ఏది చేయకపోవడంతో వారిపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఈ రోజు (బుధవారం) జమ్మూలోని రంబాన్‌ అనే ప్రాంతంలో హైదరాబాదుకు చెందిన సలావుద్దీన్ అనే వ్యక్తిని అక్కడి పోలీసులు అదుపులోనికి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బాంబు ప్రేలుళ్ళలో అనుమానితుడయిన అతను గతనెల 25 నుంచి నగరం నుంచి మాయమయినట్లు పోలీసులు చెపుతున్నారు.

 

ప్రస్తుత పరిస్థితుల్లో, హైదరాబాదు నుండి జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలకు వచ్చిన యువతపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు దీనివల్ల అర్ధం అవుతోంది. కనుక, సాధారణ ప్రజలు సైతం ఈ సమయంలో అక్కడికి వెళ్లేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని బయలుదేరడం మంచిది. సరయిన కారణాలు, సరయిన గుర్తింపు కార్డులు, సరయిన స్థానిక పరిచయాలు లేకుండా సరిహద్దు రాష్ట్రాలకు, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలకు వెళ్ళడం హైదరాబాదు యువతకు ఊహించని సమస్యలు తెచ్చే అవకాశం ఉంది.