సలామ్ సజ్జనార్... పోలీసోడు ఇలాగే ఉండాలి

 

స్త్రీల మాన, ప్రాణాలకు విలువ ఇవ్వని మృగాళ్లకు ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదని.. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఆగ్రహంతో గొంతెత్తి గర్జిస్తున్నారు. ఆ ఆగ్రహానికి కారణం దిశా ఘటన. అసలే స్త్రీలపై జరుగుతున్న వరుస ఘటనలు కలచివేస్తుంటే.. దిశా ఘటన ప్రజల్లో ఆవేశాన్ని రగిల్చింది. ఆమెని అత్యాచారం, హత్య చేసిన ఆ నలుగురు నిందితుల్ని చంపేయాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసారు. నిన్నటి వరకు ఆవేశంగా అరిచిన గొంతులు.. ఈరోజు ఒక వార్త విని.. దిశా కుటుంబానికి న్యాయం జరిగిందని ఆనందపడుతున్నాయి. ఆ వార్తే దిశా ఘటన నిందితుల ఎన్కౌంటర్. అవును ప్రజలు ఇదే కోరుకున్నారు. నిందితుల్ని చంపేస్తేనే ఇలాంటి తప్పు చేయడానికి మిగతావాళ్ళు భయపడతారని పెద్ద ఎత్తున డిమాండ్ చేసారు. ప్రజలు కోరుకుందే జరిగింది. తెల్లవారు జామున దిశా ఘటన నిందితులు నలుగుర్నీ పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేశారు.

దిశా ఘటన నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో తెలంగాణ పోలీసుల మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ దుర్మార్గుల్ని ఎన్కౌంటర్ చేసి మంచి పని చేసారంటూ ప్రజలు సెల్యూట్ కొడుతున్నారు. శంషాబాద్ సమీపంలో చటాన్ పల్లి దగ్గర నలుగురు  నిందితుల్ని పోలీసులు కాల్చి చంపారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే క్రమంలో.. పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులువారిపై  కాల్పులు జరిపారు.. నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. దిశా ఎక్కడైతే ప్రాణాలు విడిచిందో అదే ప్లేస్ లో ఆ దుర్మార్గులు ఎన్కౌంటర్ చేయబడ్డారు. ఆడకూతురు అరుస్తున్నా ఏ చలనం లేకుండా కిరాతకంగా ఎక్కడ చంపారో.. అదే ప్లేస్ లో అరుస్తూ కుక్కచావు చచ్చారు. ఈ ఎన్కౌంటర్ ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా సీపీ సజ్జనార్‌ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

దిశ ఘటన నిందితుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో.. నాడు వైఎస్ హయాంలో వరంగల్‌లో జరిగిన యాసిడ్ దాడి నిందితుల ఎన్‌కౌంటర్‌ను అందరూ గుర్తుచేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రెండు ఎన్‌కౌంటర్లు సజ్జనార్ నేతృత్వంలోనే జరగడంతో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో సజ్జనార్ వరంగల్ ఎస్పీగా ఉన్నారు. ఆ సమయంలో వరంగల్‌లో ఇద్దరి విద్యార్థినులపై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటనకు కారణమైన ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 48 గంటల్లోనే ఎన్‌కౌంటర్‌ చేశారు. నిందితులను ఘటనా స్థలికి తీసుకెళ్లిన సమయంలో పోలీసులపై నిందితులు దాడి చేసేందుకు ప్రయత్నించారని, యాసిడ్ చల్లేందుకు ప్రయత్నించారని... అందువల్లే ఆత్మరక్షణ కోసం పోలీసులు ఆ ముగ్గురిని కాల్చేశారని అప్పట్లో వరంగల్ ఎస్పీగా ఉన్న సజ్జనార్ వివరణ ఇచ్చారు. ఇప్పుడు దిశ ఘటన నిందితులను కూడా సైబరాబాద్ సీపీగా సజ్జనార్ ఉన్న సమయంలోనే ఎన్‌కౌంటర్ చేయడంతో.. సజ్జనార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రజలు. ఏదిఏమైనా ఘటన జరిగిన కొద్దిరోజులకే ఎన్కౌంటర్ చేసి.. దిశా కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు.. ఆ నలుగురు నిందితుల లాంటి మిగతా మృగాళ్లలో భయం కలిగేలా చేసారంటూ.. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.