తెరముందుకు ప్రభుత్వ సలహాదారు- వైసీపీ పాలనపై మీడియా వ్యతిరేకతే కారణమా ?

గతంలో పలు మీడియా సంస్ధల్లో సీనియర్ జర్నలిస్టుగా పనిచేసి వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన ప్రజా వ్యవహారాల సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం విజయవాడలో మీడియాతో ముఖాముఖీ నిర్వహించారు. అప్పుడప్పుడూ వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లలో మాత్రమే కనిపించే సజ్జల ఏకంగా మీడియాతో తన అభిప్రాయాలు పంచుకునేందుకు మీట్ ద ప్రెస్ నిర్వహించడం వెనుక కారణాలేమై ఉంటాయన్న దానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వ్యవహారాల్లో గతంతో పోలిస్తే మీడియాకు ఆదరణ తగ్గింది. అంతకు ముందు ఎన్నికల్లో మీడియా తమకు అనుకూలంగా లేదని వైసీపీ భావించడం వల్లో లేక ప్రభుత్వ వ్యతిరేక వార్తల పరంపర ఆపలేకపోతున్నామన్న ఆవేదనో తెలియదు కానీ వైసీపీలో ముఖ్యులెవరూ మీడియా ప్రతినిధులపై కానీ సంస్ధలపై కానీ ఓ రకమైన వ్యతిరేక భావంతో కనిపిస్తున్నారు. దీంతో మీడియా కూడా అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం తీసుకున్న మూడు నిర్ణయాలు వారిలో మరింత అభద్రతా భావాన్ని పెంచాయి. వీటిలో ఒకటి నిరాధార, పక్షపాత, పరువుతీసే వార్తలు రాస్తే వారిపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన 2430 జీవో. రెండవడి అసెంబ్లీ కవరేజ్ నుంచి మూడు మీడియా సంస్ధలను బహిష్కరించడం, మూడవది అమరావతి ఆందోళనల కవరేజ్ లో మహిళా కానిస్టేబుల్ వీడియోలు తీశారని కేసులు పెట్టడం.

వీటిలో ముందుగా అసెంబ్లీ కవరేజ్ లో భాగంగా ప్రతిపక్ష నేతల అభిప్రాయాలను తీసుకుంటున్న మీడియాపై స్పీకర్ తమ్మినేని సీతారాం కొరడా ఝళిపించారు. మూడు మీడియా సంస్ధలపై అసెంబ్లీ ప్రసారాలను కవర్ చేయకుండా బహిష్కరణ వేటు వేశారు. ఇది కొనసాగుతుండగానే అమరావతి ఆందోళలు జరుగుతున్న క్రమంలో మందడంలోని ప్రభుత్వ పాఠశాలను పోలీసులు ఆక్రమించి పిల్లలను ఆరుబయట చదివిస్తున్న విషయాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన కొన్ని మీడియా సంస్ధల ప్రతినిధులపై ప్రభుత్వం ఏకంగా ఎస్సీ, ఎస‌్టీ అట్రాసిటీ కేసులు సైతం పెట్టించింది. తాజాగా వారికి హైకోర్టు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ రెండు వ్యవహారాలతో ప్రభుత్వానికి కాస్తో కూస్తో అనుకూలంగా ఉన్న మీడియా సంస్ధల్లోనూ ఆందోళన మొదలైంది.

పరిస్ధితి చేదాటిపోతుందని అర్ధమైందో లేక, భవిష్యత్తులో మీడియా మరింత దూరమవుతుందన్న ఆవేదనో తెలియదు కానీ మీడియాకు దగ్గరవ్వాలని వైసీపీ ప్రయత్నిస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఇందులో భాగంగానే మీడియా అంటే అంటీముట్టనట్లుగా ఉండే మాజీ సీనియర్ జర్నలిస్టు సజ్జల ఏకంగా మీడియా మీట్ నిర్వహించినట్లు అర్ధమవుతోంది. సీఎం జగన్ కు రాజకీయ సలహాదారుగా ఉంటూ బ్యాక్ డోర్ లోనే అన్ని వ్యవహారాలు చక్కబెడతారని పేరున్న సజ్జల మీడియాతో మాత్రం ఎప్పుడూ ముభావంగానే ఉంటుంటారు. కానీ ఇప్పుడు పరిస్ధితి మారింది. బెట్టు చేస్తే మీడియా పూర్తిగా దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది అందుకే వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకే సజ్జల రంగంలోకి దిగినట్లు అర్ధమవుతోంది. ప్రభుత్వ విధానాలకు సంబంధించి సచివాలయంలో మంత్రులే మీడియా ప్రశ్నలకు బెంబేలెత్తి పారిపోతున్న వేళ సజ్జల మీడియా మీట్ నిర్వహించడం భవిష్యత్ పరిణామాలకు సంకేతంగా కనిపిస్తోంది. అదీ జగన్ కు సన్నిహితుడు, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కేవీపీ నిర్వహించిన పాత్రను ప్రస్తుతం పోషిస్తున్న సజ్జల మీడియాతో సఖ్యత కోసం ప్రయత్నిస్తుండటం కచ్చితంగా మార్పును సూచించే అంశంగా చెప్పుకోవచ్చు.