ఐపీయల్ నుండి తప్పుకొంటున్న పూణే వారియర్స్

 

పూణే వారియర్స్ టీం యజమాని అయిన సహారా సంస్థ వచ్చే ఏడాదిలో జరిగే ఐపీయల్ మ్యాచుల నుండి తప్పుకొంటున్నట్లు ఈరోజు ప్రకటించింది. సహారా సంస్థ పూణే వారియర్స్ టీంపై పదేళ్ళ ఫ్రాంచైస్ హక్కుల కోసం మొత్తం 1702 కోట్ల రూపాయలు చెల్లించడానికి అంగీకరించింది. ఈ ఏడాది సహారా చెల్లించవలసిన మొత్తంలో కేవలం రూ. 170 కోట్లు ఫ్రాంచైస్ ఫీసు మాత్రమే చెల్లించి, మిగిలిన మొత్తం ఇంత వరకు చెల్లించలేకపోవడంతో, ఆసంస్థ బ్యాoకు గ్యారంటీగా ఉంచిన మొత్తాన్ని బీసీసీఐ స్వాదీనం చేసుకొంది. దానితో ఆగ్రహించిన సహారా సంస్థ బీసీసీఐ పై తీవ్ర విమర్శలు చేసింది. బీసీసీఐకు ఇప్పుడు డబ్బుయావ తప్ప క్రీడా స్ఫూర్తి అసలు లేకుండా పోయిందని విమర్శించారు.

 

మీడియా ముందు తమ టీముకు మొత్తం 94 మ్యాచులు ఆడిస్తున్నట్లు ప్రకటిస్తున్న బీసీసీఐ, నిజానికి కేవలం 74 మాత్రమే కేటాయించడంతో తాము తీవ్రంగా నష్టబోతున్నామని చెప్పారు. తాము ఇదే విషయంపై బీసీసీఐకి పదే పదే విన్నవించుకొని, తమకు జరిగిన నష్టానికి ప్రతిగా ఫ్రాంచైస్ ఫీసు తగ్గించమని గత మూడు సం.లుగా కోరుతున్నపటికీ, బీసీసీఐ ఖాతరు చేయలేదని, ఇప్పుడు బ్యాంక్ గ్యారంటీని కూడా స్వాదీనం చేసుకోవడంతో తమకిక ఐపీయల్లో కొనసాగేందుకు ఆసక్తి లేదని సహారా సంస్థ ప్రతినిధులు చెప్పారు.

 

ఈ ఏడాది డిసెంబర్ తో తమకీ బీసీసీఐకి మద్య ఉన్న కాంట్రాక్ట్ ముగియనున్నందున, వచ్చే ఏడాదికి పూణే వారియర్స్ టీంకు మరో కొత్త ఫ్రాంచైస్ ను వెతుకోవలసిందిగా తాము బీసీసీఐని కోరామని తెలిపారు.