దత్తత తీసుకున్న సచిన్

 

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లాలోని పుత్తమరాజు కండ్రిగ అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ సవాల్‌ని స్వీకరించిన సచిన్ టెండూల్కర్ పుత్తమరాజు కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకుని మూడున్నర కోట్ల రూపాయలతో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సమకూర్చనున్నారు. నవంబర్ 16న సచిన్ టెండూల్కర్ ఈ గ్రామాన్ని సందర్శించి అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. పుత్తమరాజు కండ్రిగ గ్రామంలో రోజంతా అందుబాటులో తాగునీరు, వీధిలైట్లు, రోడ్లు, డ్రైనేజీ, చెత్తనిర్మూలన వ్యవస్థ, శ్మశానం, సెల్ ఫోన్ టవర్లు, వైఫై జోన్, బ్యాంకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాలలను నిర్మిస్తారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం గురించి గురువారం సతీ సమేతంగా ప్రధాని నరేంద్రమోడీనికి కలిసి సచిన్ టెండూల్కర్ వివరించారు. ప్రధాని ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్‌ను మరింత విస్తరించాలని సచిన్ టెండూల్కర్ నరేంద్రమోడీని కోరారు.