ఒకరు చేస్తే తప్పు! పదిమంది కలిసి చేస్తే ఒప్పు?

 

ఇంతకాలంగా ఎంతమంది వేలెత్తి చూపినప్పటికీ వెరవని మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి ఇద్దరూ అధిష్టానం నిర్ణయంతో తమ పదవులనుండి దిగిపోక తప్పలేదు. సీబీఐ కోర్టు ధర్మాన విచారణకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని ప్రకటించిన తరువాత, సీబీఐ ఆయనను విచారించేందుకు సిద్దపడినప్పుడు, తనపై సీబీఐ విచారణ నిలిపివేయాలని హైకోర్టునాశ్రయించి కేసులోంచి బయటపడిన ధర్మాన, నేడు తానూ నిర్దోషిగా బయటపడతానని చెప్పడం హాస్యాస్పదం.

 

తనకు కోర్టులపై నమ్మకం ఉందని, తానూ నిర్దోషినని ఆయన ధృడంగా విశ్వసిస్తున్నపుడు, ఇంత కాలం ప్రభుత్వ రక్షణ అనుభవిస్తూ సీబీఐ విచారణ నుండి ఎందుకు తప్పించుకు తిరిగారు? హైకోర్టులో సీబీఐ విచారణ నిలిపివేయాలని ఎందుకు పిటిషను వేసినట్లు?ఇంత కాలంగా తన వల్ల పార్టీకి, ప్రభుత్వానికి కూడా అప్రదిష్ట కలుగుతోందని తెలిసి కూడా పదవులలో కొనసాగిన ఆయన ఈ రోజు తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేసిన తరువాత, తన వల్ల పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలగకూడదనే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పడం కూడా హాస్యాస్పదం గానే ఉంది. మరి, మిగిలిన మంత్రులు కూడా రేపు ఇదేవిధంగా చెప్తారేమో?

 

ఇక,‘క్యాబినెట్ సమిష్టి నిర్ణయాలనే తానూ అమలు చేసాను తప్ప వ్యక్తిగతంగా ఏమి చేయలేదని అందువల్ల తనకు తప్పు ఆపాదించడం సరికాదని’ ఆయన అన్నారు. ఆయన తనకు అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వర్తిస్తానని దేవుడి మీద ప్రమాణం చేసారు. మరి ఆయన క్యాబినెట్ తప్పుడు నిర్ణయాలు తీసుకొన్నపుడు దానిని ఆయన వ్యతిరేఖించి ఉండాలి. కానీ ఆయన తన మంత్రి పదవి కాపాడుకొనేందుకు క్యాబినెట్ నిర్ణయాన్నితప్పుపట్టలేదు. ఒకవేళ వ్యతిరేఖించి ఉండి ఉంటే, ఆయనకి నేడు ఈ దుస్థితి వచ్చేదే కాదు. ఇంచు మించుగా ఇదేవిధంగా ప్రవర్తించిన సబితా ఇంద్రారెడ్డికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.

 

ధర్మానను సీబీఐ ప్రాసికుషన్ చేయడానికి అనుమతి నిరాకరిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ సమిష్టి నిర్ణయం తీసుకొన్నపుడు, ఆరోగ్య శాఖా మంత్రిగా డా. డీ.యల్. రవీంద్రా రెడ్డి క్యాబినెట్ నిర్ణయాన్ని తానూ వ్యతిరేఖిస్తున్నానని చెప్పడమే కాకుండా అందులో తన అభ్యంతరాలను నమోదు కూడా చేయించారు.

 

అప్పుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ‘క్యాబినెట్ సమిష్టి నిర్ణయాలను వ్యతిరేఖించేవారు తమ పదవుల నుండి తప్పుకొంటే మేలని’ వ్యాక్యానించారు కూడా. అయినా డా.డీ.యల్ వెనక్కి తగ్గలేదు. చివరికి ఆయన నిర్ణయమే సరయిందని నేడు రుజువయ్యింది.

 

మరి సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన మంత్రులు కూడా ఇదేవిధంగా నాటి ముఖ్యమంత్రి తప్పుడు నిర్ణయాలను వ్యతిరేఖించి ఉండవచ్చును. కానీ, అందరికీ పదవుల చింతే! పైగా డా.రాజశేఖర్ రెడ్డి కొండంత అండగా నిలబడటంతో నాడు తప్పులు కూడా ఒప్పులుగానే కనిపించాయి. అందుకే, మంత్రులు అంత నిర్భయంగా ఫైళ్ళ మీద ఎడా పెడా సంతకాలు చేసేసారు.

 

కానీ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణంతో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. బహుశః ఆయన తదనంతరం జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేప్పటి ఉండి ఉంటే, నేటికీ ఈ తంతు నిర్భయంగా కొనసాగుతూనే ఉండేదేమో?

 

మంత్రు లిద్దరూ కూడా “తమకి వ్యక్తిగతంగా లబ్ది చేకూరలేదు గనుక, క్యాబినెట్ సమిష్టి నిర్ణయాలనే అమలు చేసాము గనుక తాము తప్పు చేయలేదని” వాదించడం కూడా చాల అసమంజస వాదన. ప్రజలు చెల్లిస్తున్న పన్నులతో జీతాలు అందుకొంటూ, సకల రాజభోగాలు అనుభవిస్తూ తాము చేప్పటిన పదవులకి న్యాయం చేయలేని వారు, ప్రభుత్వ ఆస్తులను కాపాడలేనివారు తప్పు చేసినట్లు కాదా?

 

ఒక తప్పును పదిమంది కలిసి చేస్తే ఒప్పు అవుతుందా? ఇటువంటి వితండ వాదనలు ఒక సరికొత్త సంప్రదాయానికి తెర తీస్తాయి. మంత్రిగా ఎవరికీ బాధ్యత ఉండదు. సమిష్టి నిర్ణయానికీ ఎవరూ బాధ్యులు కారు. అటువంటప్పడు జరిగిన తప్పుకి ఎవరు భాద్యత వహిస్తారు? జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఎవరు పూడుస్తారు? ఎవరు శిక్ష అనుభవిస్తారు?

 

మంత్రులు అనాలోచిత నిర్ణయాల వల్ల అంతిమంగా నష్టబోయేది ప్రజలే, వృధా అయ్యేది కూడా ప్రజా ధనమే. నేడు మంత్రుల, అధికారుల అవినీతిని బయటపెట్టి, నేర నిరూపణ చేయడం కోసం సీబీఐ, కోర్టులు, ఇంకా ఇతర ప్రభుత్వ శాఖలపైనా వందల కోట్ల ప్రజాధనం ఖర్చు అవుతోందంటే, దానికి ఆనాడు మంత్రివర్గం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వలననే కదా? ఆ నాడు మంత్రి వర్గం బాధ్యతలెరిగి, సక్రమంగా వ్యవహరించి ఉండి ఉంటే నేడు ప్రజలు ఈ అదనపు ఆర్ధిక భారం మోయవలసి ఉండేదే కాదు కదా?

 

మంత్రులిద్దరూ ప్రస్తుతం మీడియా ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు వారు ఎటువంటి వాదనలయినా చేయవచ్చును. దాని ప్రజలు ఖండించలేరు కూడా. కానీ, రేపు బోనులో నిలబడి ఇటువంటి వాదనలతోనే న్యాయస్థానాన్నికూడా ఒప్పించగలరా?ఒకవేళ ఒప్పించగలిగితే, వారి నీతి నిజాయితీలను ఇక ఎవరూ కూడా శంఖించలేరు.