ఆదిలాబాద్ జిల్లాల్లో ఆర్టీసీ సమ్మె పై ఎమ్మెల్యేల మౌనానికి కారణాలు ఏమిటి?


ఆర్టీసీ సమ్మె రోజురోజుకు ఉధృక్తం అవుతున్న నేపధ్యంలో కొన్ని అనుమానాలు మాత్రం అందరినీ వెంటాడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో తొమ్మిది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు ,వీరెవరూ సమ్మె పై ఇప్పటికీ నోరు విప్పలేదు. మొత్తం ఆరు డిపోల పరిధిలో సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్ నియోజక వర్గంలోని భైంసా, మంచిర్యాల ,ఆస్ఫాబాద్, ఉట్నూర్ డిపోల పరిధిలో ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు నిత్యం సాగుతున్నాయి.నిర్మల్ సిటింగ్ ఎమ్మెల్యే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఇప్పటికీ స్పందించకపోవటం గమనార్హంగా మారింది.ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తే ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది ప్రజాప్రతినిధులు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది.అందుకే సొంత నియోజకవర్గంలో పర్యటించిన సమ్మె పై ఎలాంటి వ్యాఖ్యలు చేయడంలేదట.

ఈ లెక్కన గులాబీ బాస్ కు సొంత పార్టీ ప్రజా ప్రతి నిధుల నుంచి కూడా సంపూర్ణ మద్దతు లభించడం లేదన్న చర్చ సాగుతోంది.ఆర్టీసి విషయంలో కేసీఆర్ వ్యూహం ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతానికైతే ఆర్టీసీ కార్మికులపై సానుభూతి వెల్లువెత్తుతోంది. ఇతర కార్మిక ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నుంచి మాత్రమే కాకుండా సాధారణ ప్రజల నుంచి కూడా మద్దతు పెరుగుతోంది. సమ్మెలో ఉన్నవారి ఉద్యోగం పోయినట్టే అంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను కూడా ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. పైగా బస్ డిపోలు, బస్టాండ్ ల వద్ద పోలీసు బలగాలను భారీగా మోహరించడం కూడా ప్రభుత్వ వ్యతిరేకత కారణమవుతోంది. భద్రతా చర్యల పేరిట కొన్ని ప్రాంతాల్లో పోలీసులు చేస్తున్న అతిని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇంత నిర్బంధం లేదని అప్పుడు పోలీసులు ఇలాగే చేస్తే తెలంగాణ ఉద్యమం కొనసాగేదా అని ప్రజల్లో చర్చ సాగుతోంది.

మొత్తం మీద ముఖ్య మంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వ వైఖరి, కొందరు అమాత్యుల అనాలోచిత వ్యాఖ్యలు మరి కొందరు మంత్రులు మౌన మునులుగా మారడం ఇలాంటివన్నీ టీఆర్ఎస్ సర్కార్ సంకట స్థితిలో ఉందనడానికి నిదర్శనలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.చివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సోషల్ మీడియాలో వెన్నుదన్నుగా నిలిచే అభిమానుల సైతం మౌనం దాల్చడం గులాబీ పార్టీకి మింగుడుపడని పరిణామంగా మారిందట. ఈ క్రమంలో ప్రస్తుతం మెజారిటీ టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అటు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించలేక ఇటు సమ్మెను ఖండించలేక కప్పదాటు వైఖరి అవలంభిస్తున్నారు. మరి ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు  దారి తీస్తుందో వేచి చూడాలి.