ఆర్టీసీ సమ్మె పరిష్కారం కేసీఆర్‌కు పెద్ద సవాల్‌గా మారనుందా?

ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం తరువాత జరుగుతున్న తొలి సమ్మె తీవ్రరూపం దాల్చటం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇబ్బందికరమైన అంశమే అని చెప్పాలి. అది సకల జనుల సమ్మె వైపు నిజంగానే వెళితే మొత్తం సమాజాన్ని కుదిపివేసే విషయం అవుతుంది. కేసీఆర్ బహుశా ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆర్టీసీని యాభై శాతం ప్రైవేటీకరిస్తామని ఆయన అంటున్న వైనం రాజకీయంగా ఆయనకు నష్టం చేయొచ్చన్న అభిప్రాయం కలుగుతుంది. అంతేకాదు కార్మికులను ఉద్దేశించి యాభైవేల మందిని తొలగించేశామని చెప్పిన వైనం ప్రజాస్వామ్యంలో సరైనదేనా అన్న చర్చ జరుగుతోంది.

అంతకన్నా సెప్టెంబర్ నెలలో పని చేసిన కాలానికి ఆర్టీసీ కార్మికులకు జీతం ఇవ్వకుండా ఆపడం అమానవీయమని చెప్పక తప్పదు. అంతేకాదు సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు తార్నాక ఆసుపత్రిలో చికిత్సలు నిలిపివేయడం అమానుషమని చెప్పక తప్పదు. ఒకప్పుడు ఆర్టీసీ కార్మికులకు కాలిలో ముల్లు గుచ్చుకుంటే నాలుకతో ముల్లు తీస్తానని అన్న కేసిఆర్ కేవలం పండుగ అడ్వాన్స్ కోసం గతంలో ఆర్టీసీ కార్మికుల తరపున ధర్నాలు చేసిన టీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీ కార్మికులతో తగాదా పెట్టుకోవడం అసలు సంఘాలే ఉండరాదు అనే పరిస్థితికి వెళ్ళడం చారిత్రక విషాదమని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం కార్మిక సంఘాల జేఏసీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి టీఆర్ఎస్ కు పార్టీ ముఖ్య నేతలకు సన్నిహితుడే, అప్పట్లో హరీశ్ రావు నేతృత్వంలో టిఆర్ఎస్ కు అనుబంధంగా ఆర్టీసీలో కార్మిక సంఘం ఏర్పాటు చేసి కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించింది వాస్తవం కాదా ఇక్కడ సమస్య ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయబద్ధమా కాదా అన్నది కాదు. ఇక్కడ  ఆర్టీసీ కార్మికులు తప్పు చేశారా లేదా పండుగ ముందు సమ్మెలోకి వెళ్లి ఆర్టీసీకి, ప్రయాణికులకు కష్టనష్టాలూ తెచ్చిపెట్టార లేదా అన్నది కాదు కేవలం కేసీఆర్ వ్యవహార శైలి చర్చనీయాంశమవుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న మట వాస్తవమే అయిన దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశారు. కానీ వారిని సరైన తీరులో వ్యవహరించడంలో విఫలం అవ్వడం వల్ల ఈ సమస్య ఇంతదాకా వచ్చిందన్న భావన కలుగుతోంది.

పైగా గతంలో తమిళనాడులో ఆనాటి ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వ ఉద్యోగులు లక్షా డెబ్బై వేల మందిని ఒక్క కలం పోటుతో తీసివేస్తున్నట్లు ప్రకటించిన మాదిరే ఇక్కడ కేసీఆర్ కూడా యాభైవేలమంది ఉద్యోగులు తీసేశాననే ఒకసారి సెల్ఫ్ డిఫెన్స్ అయ్యారని మరోసారి అంటున్నారు. జయలలిత ఉద్యమ రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి కాలేదు. ఆమె ఎంజిఆర్ వారసురాలిగా సినిమా నటిగా గుర్తింపు పొంది ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రయ్యారు. కానీ కేసీఆర్ ఉద్యమాలు చేశారు. తెలంగాణ సాధనలో కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అని ఆయననే చెప్పుకుంటారు. అనేక రకాల సమ్మెలకు ఆయన అప్పట్లో బాధ్యత వహించారు. సకల జనుల సమ్మె వాటిని ఆయన ప్రోత్సహించారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పై ఒంటి కాలిపై లేచేవారు. మరి ఇప్పుడు ఈ సమ్మే పై ఆయన వైఖరి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.