వరాల వరద.. కేసీఆర్ వరాల జల్లులో తడిసి ముద్దైన ఆర్టీసీ ఉద్యోగులు

 

సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు అందించారు. సెప్టెంబరు నెల జీతాలు వెంటనే చెల్లిస్తామని సీఎం సమ్మె కాలపు జీతాన్ని సైతం ఇస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల వయో పరిమితి పెంపు, సమ్మె సమయంలో చనిపోయిన కార్మిక కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు.ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులు అని పిలిచే పద్ధతికి స్వస్తి పలికి అందరిని ఉద్యోగులనే పిలవాలన్నారు సీఎం కేసీఆర్. సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి 8 రోజులు ఉద్యోగం ఇవ్వాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరపున 2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్టుగా స్పష్టం చేశారు. 

ఆర్టీసీ కార్మికులతో సీఎం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో వరాలు కురిపించారు. సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ కలర్ బ్లైండ్ నెస్ ఉన్న వారిని వేరే విధుల్లో చేసుకోవాలి తప్ప ఉద్యోగం తొలగించొద్దని ఉన్నతాధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్తలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని.. కరెంటు , మంచినీటి సమస్యలు పరిష్కరించామని అన్నారు.మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు వెయ్యొద్దని రాత్రి ఎనిమిది గంటలకు మహిళలు డ్యూటీ దిగేలా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి డిపోలో కేవలం ఇరవై రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక మరుగు దొడ్లు, డ్రెస్సింగ్ చేంజ్ గదులు, లంచ్ గదులు ఏర్పాటు చెయ్యాలన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మూడు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేస్తామన్నారు. మహిళలకూ కాకీ డ్రెస్సు తొలగిస్తామని, యూనిఫాం వేసుకునే వెసులుబాటు కల్పిస్తామని సీఎం తెలిపారు. రెండేళ్ల పాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించేది లేదని సీఎం కేసీఆర్ చెప్పారు.ప్రతి డిపోలో ఇద్దరు చొప్పున కార్మికులు సభ్యులుగా కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 

ఉద్యోగుల తల్లితండ్రులు కూడా వర్తించేలా ఆర్టీసీలో హెల్త్ సర్వీసుల అందించాలనీ హైదరాబాద్ లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల తల్లితండ్రులకు ఉచిత బస్ పాసులు అందించాలని ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ సౌకర్యం వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు. ఉద్యోగుల పీఎఫ్ బకాయిలను సీసీఎస్ కు చెల్లించాల్సిన డబ్బులను చెల్లిస్తామన్నారు. డిపోలో కావలసిన స్పేర్ పార్ట్స్ ను అందుబాటులో ఉంచుతామని ఆర్టీసిలో పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేస్తామని ఆర్టీసి ఉద్యోగుల గృహ నిర్మాణ పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తుందని పేర్కొన్నారు. ఆర్టీసీలో పార్సిల్ సర్వీసులను ప్రారంభించాలని ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారు సీఎం కేసీఆర్.