టెస్టుల్లోనూ మొదలైన రికార్డుల వేట.. రోహిత్ ఖాతాలో అద్భుతమైన రికార్డు

 

టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ టాలెంట్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మిగతా స్టార్ బ్యాట్స్ మెన్ వన్డేల్లో సెంచరీలు చేసినంత ఈజీగా రోహిత్ డబుల్ సెంచరీలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటాడు. అయితే ఇప్పుడు రోహిత్ టెస్టుల్లో కూడా అదరగొడుతున్నాడు. మొన్నటి వరకు టెస్ట్ టీంలో చోటు దక్కించుకోలేకపోయిన రోహిత్.. ఇప్పుడు టెస్టుల్లో ఓపెనర్ గా తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సత్తా చాటుతున్నాడు.

ప్రస్తుతం టీమిండియా.. దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచి.. సిరీస్ కైవసం చేసుకున్న కోహ్లీసేన.. శనివారం మొదలైన మూడో టెస్ట్ కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలనుకుంటుంది. అయితే ఈ సిరీస్ కి అనూహ్యంగా ఓపెనర్ గా ఎంపికైన రోహిత్.. వన్డేల్లో లాగానే అదరగొడుతున్నాడు. ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్ ల్లో రెండు సెంచరీలు చేసి ఆకట్టుకున్న రోహిత్.. మూడో మ్యాచ్ లో కూడా సెంచరీ చేసి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 39 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను రోహిత్ సెంచరీతో ఆదుకున్నాడు. ఈ సిరీస్‌లో రోహిత్‌ కిది మూడో సెంచరీ కాగా.. మొత్తంగా టెస్టుల్లో రోహిత్ కిది 6వది. ఈ క్రమంలో ధోని, పటౌడీల సెంచరీల రికార్డుని రోహిత్ సమం చేశాడు. ధోని 90 టెస్టుల్లో 6 సెంచరీలు నమోదు చేయగా.. రోహిత్ తన 30వ టెస్టులోనే 6వ సెంచరీని సాధించాడు. ఇక, దిగ్గజ ఆటగాడు సునీల్‌ గవాస్కర్‌ తన కెరీర్‌లో ఒక సిరీస్‌లో మూడు అంతకంటే సెంచరీలను మూడు సందర్భాల్లో సాధించాడు. గవాస్కర్‌ తర్వాత ఒకే సిరీస్ లో మూడు సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ అరుదైన ఘనత సాధించాడు.

అదేవిధంగా సిక్సుల్లోనూ రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ సిరీస్ లో రోహిత్ 17 సిక్సులు కొట్టాడు. దీంతో గతంలో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ షిమ్రోన్ హెట్‌మేయర్ బంగ్లాదేశ్ తో ఆడిన సిరీస్ లో కొట్టిన 15సిక్సుల రికార్డును బద్దలు కొట్టేసాడు. దీన్నిబట్టి చూస్తుంటే వన్డేల్లోనే కాదు టెస్టుల్లోనూ రోహిత్ రికార్డుల వేట మొదలైందని చెప్పాలి.