ఐదేళ్ళ కుర్రాడి ‘సమయస్ఫూర్తి’

 

‘సమయస్ఫూర్తి’ అనగానే నాకు అయిదేళ్ళ రోహన్‌ గుర్తుకొస్తాడు. పదేళ్ళ కిందటి మాట.. అప్పుడు గుజరాతనలో భూకంపం వచ్చినపుడు ఈ ఐదేళ్ళ కుర్రాడు చూపించిన సమయస్ఫూర్తిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పట్లో పేపర్లనిండా ఆ అబ్బాయి చూపించిన దైర్యం, సమయస్ఫూర్తిల గురించిన విశేషాలే. అప్పుడు రోహన్‌ గురించి విన్నవాళ్ళు ఎవరూ ఆ అబ్బాయిని మర్చిపోలేరు. అందుకే ఇప్పటికీ పిల్లల ` సమయస్ఫూర్తి అని ఎవరైనా చెబుతుంటూ నాకు చటుక్కున రోహన్‌ గుర్తుకొస్తాడు. ఇంతకీ ఆ అబ్బాయి చూపించిన సమయస్ఫూర్తి ఏంటో తెలుసా... భూకంపంవచ్చి తన చుట్టూ ఉన్న ఇళ్ళన్నీ పేకమేడల్లా కూలిపోతుంటే తన సంవత్సరం తమ్ముడిని రక్షించటం...

 

రోహన్‌ అమ్మా నాన్న ఓ రోజు ఉదయాన్నే డాక్టర్‌ని కలవటానికి బయటకి వెళ్ళారు. ఐదేళ్ళ రోహన్‌, సంవత్సరం వయసున్న అతని తమ్ముడు, 10 ఏళ్ళ పనివాడు ఇంట్లో వున్నారు. పిల్లలిద్దరూ పడుకుని ఉన్నారు. ఇంతలో ఏదో శబ్దాలు కావటంతో తెలివి వచ్చింది రోహన్ కి. భయంతో అమ్మని పిలిచాడు... పలకలేదు... ఇంతలో గదిలోని అద్దాల బీరువా అద్దాలు భళ్ళున పగిలి ఇల్లంతా పడ్డాయి. దాంతో ఏదో జరుగుతోందని అర్ధమయ్యింది రోహన్‌కి. గబ గబ లేచి... చుట్టూ చూశాడు. పక్కన తమ్ముడు పడుకుని వున్నాడు. వాడిని ఎలా ఎత్తుకోవాలో కూడా తెలిని వయసు రోహన్‌ది. అయినా వాడిని గుండెల దగ్గరగా గట్టిగా పట్టుకుని, పగిలిన అద్దం ముక్కలని తప్పించుకుంటూ ముందుకు నడిచాడు. తలుపులు, కిటికీలు కొట్టుకుంటున్నాయి. వీళ్ళు నాలుగో అంతస్తులో వున్నారు. ఆ తర్వాత ఏమయ్యిందో ఈ కార్యక్రమం తర్వాత.



ఐదేళ్ళ రోహన్‌ సంవత్సరం వయస్సున తన తమ్ముడిని గుండెలకి గట్టిగా హత్తుకుని నాలుగంతస్తులు దిగాడు. దారిలో ఒక్కరు కూడా కనిపించలేదట. అంటే భూమి కంపించటం మొదలవగానే అందరూ ప్రాణ భయంతో బయటకి పరుగులు తీశారు. వీళ్ళింట్లోని పని కుర్రాడు కూడా వెళ్ళిపోయాడు. రోహన్‌కి తెలివి వచ్చాక తమ్ముడిని తీసుకుని గోడలు బీటలు వారటం, మట్టి పెళ్ళలు పడటం జరుగుతూనే వున్నాయట. అయినా కంగారు పడకుండా, తమ్ముడిని వదలకుండా కిందకి వచ్చాడు. కిందకి వచ్చి చూస్తే అందరూ అటూ, ఇటూ పరుగులు పెడుతున్నారు. ఏం చెయ్యాలో తోచలేదు కాసేపు రోహన్‌కి.



ఎదురుగా కొంచెం దూరంలో రైలు పట్టాలు.. కనిపిస్తే అటు నడిచాడట రోహన్‌. వేగంగా రైలు వస్తుంటే ఆగి, అది వెళ్ళిపోయాక పట్టాలు దాటి పొలాల వైపు వెళ్ళాడట. ఇంతలో గుక్కలు పెట్టి అతని తమ్ముడు ఒకటే ఏడుపుట. పొలాల గట్టు పక్కన ఓ చెట్టు కనిపిస్తే అక్కడ ఆ చెట్టు నీడలో తమ్ముడిని కిందకి దించి తనూ కూర్చున్నాడు. ఏడుస్తున్న తమ్ముడిని అవి, ఇవి చూచించి ఏడుపు మానిపించాలని చూస్తుండగా, అతని అమ్మా నాన్న వెతుకుంటూ వచ్చారట. హాస్పటల్‌లో వుండగా భూకంపం వస్తోందని తెలియగానే పిల్ల కోసం పరిగెట్టుకుంటూ వచ్చారు రోహన్‌ తల్లితండ్రులు. వీళ్ళు వచ్చేసరికి వాళ్ళ అపార్టుమంటు కూలిపోయి వుంది. పిల్లల కోసం పిచ్చివాళ్ళలా ఆ శిధిలాల్లో వెతికారు. ఇంతలో ఎవరో ఇద్దరు చిన్న పిల్లలు రైలు పట్టాలవైపు వెళ్ళారని చెబితే.. ఆవైపు వచ్చారు రోహన్‌ అమ్మానాన్న.



రోహన్‌ తమ్ముడిని తీసుకుని కిందకి రావటం కొంచం ఆలస్యమయి వుంటే? తమ్ముడిని ఎత్తుకోలేనని వదిలేసి ఒక్కడే కిందకి వస్తే? భయంతో ఇంట్లోనే వుండిపోతే? ఇవన్నీ ప్రశ్నలే. అయితే ఏదో ఆపద వస్తోంది... ఇంట్లోంచి బయటకి వెళ్ళిపోదాం అనుకున్న రోహన్‌ బయం సంగతి మర్చిపోయి తమ్ముడిని మోసుకుంటూ బయలుదేరాడు. నీకు భయం వేయలేదా అని ఆ తర్వాత అందరూ అడిగారు. దానికి రోహన్‌ ఏం చెప్పాడో తెలుసా.. ఏమో.. తమ్ముడు ఏడుస్తున్నాడు.. ఇక్కడ ఏదో జరుగుతోంది.. అందుకని దూరంగా వెళ్ళిపోవాలనుకున్నా, అమ్మానాన్న వచ్చేదాక తమ్ముడి ఏడుపు ఏలా ఆపాలా అనే ఆలోచించా కాని.. నాకింకేం తెలీలేదు అన్నాడు.  ఇప్పుడు చెప్పండి.. రోహన్‌ గురించి విన్న వారెవరైనా, ఎన్నిసంవత్సరాలైనా ఆ అబ్బాయిని మర్చిపోగలరా? రోహన్‌ గురించి పిల్లలకి చెప్పండి... ఇలాంటి  సంఘటనలు పిల్లల్ని ఆలోచింప చేస్తాయి.

....రమ