అతనిది ‘మంచి’నీళ్ళ మనసు!

 

పిల్లల మనసులు స్వచ్ఛంగా వుంటాయి. అమాయకంగా ఆలోచిస్తాయి. అయితేనేం ఆ మనసులలో ఏదన్నా పడిందంటే అంత తొందరగా మర్చిపోరు. మనం విసుక్కుంటున్నా పదేపదే ఆ విషయాన్నే అడుగుతూ వుంటారు. మనకి అది విసుగనిపిస్తుంది. కానీ వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ‘రియాన్’లా చిన్న వయసులోనే అద్భుతాలు చేయచ్చేమో. రియాన్‌కి ఆరేళ్ళ వయసులో టీచర్ మంచినీళ్ళ గురించి పాఠం చెబుతూ అవి ఆరోగ్యానికి ఎంతో అత్యవసరమైనవి, అయితే ప్రపంచంలో వందకోట్ల మందికి పైగా మంచినీరు దొరకక ఇబ్బందిపడుతూ వుంటారని చెప్పారు. అది విని రియాన్ మనసులో ఎన్నో సందేహాలు. ఇంటికి వచ్చి వాళ్ళమ్మ ముందు ఉంచాడా సందేహాలన్నీ. ఆమె ఓపిగ్గా అన్నిటికీ సమాధానం చెప్పింది. అసలు సమస్య ఏంటి? దాని పరిష్కారం ఏంటి? ఏం జరిగితే వాళ్ళదరి ఇబ్బందులు తీరతాయి? వంటివన్నీ వివరంగా చెప్పింది రియాన్‌కి వాళ్ళమ్మ. అమ్మ చెప్పిన విషయాలన్నీ విన్న రియాన్ ‘‘అమ్మా నేను వాళ్ళందరి నీటి కష్టాలని తీరుస్తాను. అందరికీ మంచినీళ్ళు అందిస్తా’’ అన్నాడు.

 

కొడుకు మాటలని చిన్నపిల్లాడి మాటలని తీసిపారేయలేదు ఆమె. నువ్వేం చేయగలవని నిరుత్సాహ పరచలేదు. ఆమె ఓ స్వచ్ఛంద సంస్థకి ఫోన్ చేసి తన కొడుకు ఆశయం గురించి చెప్పింది. వాళ్ళ సలహా మేరకు రియాన్ తన అన్నయ్యతో కలసి చుట్టుపక్కల వారిని, తెలిసిన వారిని సాయం కోరాడు. అతి కష్టం మీద ఓ 200 డాలర్లు సమకూరాయి. ఆ మొత్తాన్ని ఓ ఎన్జీఓ సాయంతో ఉగాండాలోని ఓ మారుమూల గ్రామంలో బోరుబావి తవ్వించడానికి ఉపయోగించారు. ఆ బోరుబావిలోని నీరు అక్కడి ప్రజలందరికీ అందిని రోజున రియాన్ ఆనందానికి హద్దులు లేవు. అప్పటిదాకా ఏదో చిన్నపిల్లాడు అడిగాడు కదా అని సాయం చేసిన వారంతా ఆ కుర్రాడి పట్టుదలని అర్థం చేసుకుని సాయపడటం మొదలుపెట్టారు.

 

అప్పుడు ‘రియల్ వెల్ ఫౌండేషన్’ మొదలైంది. ప్రపంచంలో ఎక్కడెక్కడ మంచినీటి కొరత వుందో భూతద్దం పెట్టి వెతకడం మొదలుపెట్టాడు రియాన్. అతని కుటుంబ సభ్యులు కూడా అతనికి తోడుగా నిలిచారు. ప్రపంచ దేశాల్లో రక్షిత తాగునీటికి నోచుకోని ప్రజల్ని గుర్తించడం, వారి అవసరాలని తీర్చేవిధంగా ప్రాజెక్టులు రూపకల్సన చేయడం, నిధుల సేకరణ, ఆ ప్రాజెక్టుల అమలు, కార్యకలాపాలు చురుకుగా సాగిపోయాయి. ఇథియోపియా, జింబాబ్వే, కెన్యా.. ఇలా ఎన్నో దేశాలలో మంచినీటి బావులు, బోరులు తవ్వించగలిగాడు. ఎన్నో ఆఫ్రికా దేశాల్లో రియాన్ సేవలు బాగా విస్తరించాయి. దాదాపు 14 దేశాలకు పైగా కొన్ని వందల ప్రాజెక్టులు చేపట్టి వాటిని పూర్తిచేసింది రియల్ వెల్ ఫౌండేషన్.

 

ఇప్పుడు రియాన్‌కి 20 ఏళ్ళు. ఈ 14 ఏళ్ళ కాలంలో తన చదువు, ఆటలు, పాటలతో పాటు తన ఆశయ సాధనకు కూడా సమయం వెచ్చిస్తూ వస్తున్నాడు రియాన్. ఎన్నో స్కూళ్ళకి వెళ్ళి అక్కడ విద్యార్థులకు తాగునీటిపై అవగాహన కల్పిస్తూ వుంటాడు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొంటాడు. పెద్దపెద్ద నేతల ముందు తన ఆశయం, సాధించిన విజయాలు, చేయాల్సిన పనుల గురించి చక్కగా ప్రసంగిస్తాడు. అందుకే ఎన్నో అతర్జాతీయ అవార్డులు రియాన్‌ని వెతుక్కుంటూ వచ్చాయి. దాదాపు అన్ని ప్రముఖ దేశాల అధినేతలు రియాన్‌ని స్వయంగా కలసి అభినందించారు. చిన్న వయసులోనే యూనిసెఫ్‌కి వాటర్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు రియాన్.

 

‘‘నేను చాలా సామాన్యమైనవాడిని. నేను గ్లాసు మంచినీళ్ళు తాగినప్పుడల్లా ఈ నీరు దొరకక ఎంతమంది బాధపడుతున్నారో కదా అనిపిస్తుంది. అంతే, నా ఆశయం నన్ను పరిగెత్తిస్తుంది. ప్రపంచంలో ఎన్నో కష్టాలు. అన్నీ నేను తీర్చలేకపోవచ్చు. కానీ, కనీస అవసరమైన మంచినీరు అందరికీ అందేలా చేస్తాను’’ ఇవి రియాన్ మాటలు. అనడమే కాదు, చకచకా ముందుకు సాగిపోతున్నాడు కూడా. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 884 మిలియన్ ప్రజలు రక్షిత మంచినీరు అందక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ ఎన్నో మిలియన్స్ ప్రజలు ఈ కారణంగా ప్రాణాలు వదులుతున్నారు. ఇవి లెక్కలు. కానీ రియాన్ లాంటి వాళ్ళని కదిలించే సత్యాలు. హ్యాట్సాఫ్ టు రియాన్ అందామా!