విజయారెడ్డి మర్డర్ ఎలా జరిగిందంటే... మినిట్ టు మినిట్... సీన్ టు సీన్...

పక్కా పథకం ప్రకారమే, తహశీల్దార్ విజయారెడ్డిని మర్డర్ చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకి వచ్చారు. ముందస్తు వ్యూహంతోనే రద్దీ తక్కువగా ఉండే మధ్యాహ్న సమయాన్ని ఎంచుకున్న దుండగుడు... ప్లాన్ ప్రకారం సంచిలో పెట్రోల్‌ను తెచ్చుకోవడమే కాకుండా, తహశీల్దార్‌ను మాటల్లో పెట్టి... సడన్‌గా అటాక్ చేశాడు. దాంతో క్షణాల్లో విజయారెడ్డి మంటల్లో కాలి సజీవదహనమైపోయారు.

తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి అత్యంత పాశవికంగా హత్య చేసిన నిందితుడు సురేష్‌... ఉదయం 11గంటల వరకు ఇంట్లోనే ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పటివరకు కుటుంబ సభ‌్యులతో కలిసి ఇంటి పనులు చేసిన సురేష్... ఆ తర్వాత బయటికెళ్లాడని చెబుతున్నారు. మధ్యాహ్నం 12గంటలకు సురేష్‌కు ఫోన్ స్విచ్చాఫ్ వచ్చిందని అంటున్నారు. అయితే, మధ్యాహ్నం పన్నెండున్నరకి అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయానికి సురేష్ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు, తహశీల్దార్ విజయారెడ్డి... మధ్యాహ్నం ఒంటి గంటకే భోజనం ముగించుకుని... తన ఛాంబర్‌లో ఒంటరిగా కూర్చున్నారు. అదే అదునుగా భావించిన సురేష్ ...సరిగ్గా ఒకటిన్నర సమయంలో విజయారెడ్డి ఛాంబర్లోకి ఎంటరైయ్యాడు. మాట్లాడే పని ఉందంటూ లోపలికి వచ్చిన సురేష్‌... వెంటనే విజయారెడ్డితో వాగ్వాదానికి దిగాడు.

అయితే ముందస్తు ప్లాన్‌ ప్రకారం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను సడన్ గా బయటికి తీసిన సురేష్‌.... ఒక్కసారిగా విజయారెడ్డిపై పోసి నిప్పంటించాడు. అప్పుడు సమయం దాదాపు మధ్యాహ్నం 1:55 అవుతోంది. అయితే, ఒక్కసారి భగ్గుమన్న శబ్ధం రావడతో తహశీల్దార్ కార్యాలయంలో కలకలం రేగింది. గ్యాస్ సిలిండర్ పేలిందనుకుని ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. అయితే, తన ఛాంబర్ ముందు విజయారెడ్డి మంటల్లో తగలబడిపోతుండటాన్ని గమనించిన కొందరు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే విజయారెడ్డి మంటల్లో కాలిపోయారు. పెట్రోల్ పోసి నిప్పటించిన ఐదారు నిమిషాల్లోనే విజయారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తన ఛాంబర్ తలుపు ముందు అరుపులు కేకలతో గిలగిలాకొట్టుకుంటూ తుది శ్వాస విడిచింది.