గూండాల అసెంబ్లీ... ఎర్రబెల్లి

తెలంగాణలో శనివారం శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ నరసింహన్ సభను ప్రారంభించారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే టీఆర్ఎస్, టీడీపీ నేతల మధ్య వాగ్వాదాలు జరిగాయి. గవర్నర్ ప్రసంగిస్తుండగా టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో టీఆర్ఎస్ నేతలు పోడియం చుట్టూ చేరి గవర్నర్ ప్రసంగానికి ఎటువంటి ఆటంకం కలుగకుండా చేశారు. ఈ సందర్భంలో ఇరుపక్ష నేతల మధ్య తోపులాటలు జరిగాయి. ప్రసంగం ముగిసిన తర్వాత టీడీపీ నేత రేవంత్ రెడ్డి విలేకరులతో మ్లాటాడుతూ... ఈరోజు ప్రజాస్వామ్యానికి దుర్ధినం, దొరతనానికి శుభదినమని, తమను అడ్డుకున్న మార్షల్స్ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా తమ నేతలపై చేసిన దాడిని తప్పుబట్టారు. అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజని, టీఆర్ఎస్ నేతలు గూండాల్లా తమ మీద దాడి చేశారని ఆరోపించారు. ఇది తెలంగాణ అసెంబ్లీ కాదని, గుండాల అసెంబ్లీ అని వ్యాఖ్యానించారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునేంత వరకు సభను నడవనీయబోమని స్పష్టం చేశారు.