రేవంత్ రెడ్డి కొత్త లాజిక్.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైనట్టే!!

 

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు కోరుతుంటే.. కేసీఆర్ సర్కార్ మాత్రం అసలు ఆ ఆలోచనే లేదని తేల్చి చెప్పింది. అయితే కాంగ్రెస్ నేత, మల్కాజగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మాత్రం ఆర్టీసీ ఆల్రెడీ ప్రభుత్వంలో విలీనం అయినట్టే అంటున్నారు. అంతేకాదు దానికి ఆయన అదిరిపోయే లాజిక్ కూడా చెప్తున్నారు.

బుధవారం సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన సకల జనుల సమరభేరిలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించినందున.. తెలంగాణలో కూడా విలీనమైనట్లేనని అన్నారు. రాష్ట్ర విభజన జరిగినా ఆర్టీసీ విభజన, పంపకాలు ఇంకా జరగలేదని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పిందని, అలాంటప్పుడు ఏపీ సర్కారు తీసుకున్న విలీన నిర్ణయం తెలంగాణకు వర్తిస్తుందని లాజిక్ చెప్పారు. దానిని తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేసి తీరాల్సిందేనని రేవంత్ అన్నారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని రేవంత్ డిమాండ్‌ చేశారు. విమానాల్లో ఇంధ‌నానికి జి.ఎమ్.ఆర్. సంస్థ నుంచి ఒక్క శాత‌మే ప‌న్ను వ‌సూలు చేస్తున్నార‌ని, పేదోడు తిరిగే బ‌స్సుల‌కు మాత్రం 27.5 శాతం వ‌సూలు చేస్తున్నార‌న్నారు. దీంతో ఆర్టీసీ మీద రూ. 700 కోట్ల అద‌న‌పు భారం మీద ప‌డుతోంద‌న్నారు. 18 ర‌కాల ఉచిత బ‌స్ పాస్ ల‌ను ప్ర‌భుత్వం ఇచ్చి, ఆ బ‌కాయిల్ని చెల్లించ‌లేద‌న్నారు. ఓ రకంగా ఆర్టీసీని ముంచింది ప్ర‌భుత్వ‌మే అని విమ‌ర్శించారు. మొత్తం బకాయిలు చెల్లించాలంటూ హైకోర్టు చెప్తే.. ఆర్టీసీ ఇంకా ఉమ్మ‌డి రాష్ట్రంలోనే ఉంద‌ని కేసీఆర్ స‌ర్కారు వాదించిందని గుర్తుచేశారు. ఆర్టీసీ విభ‌జ‌న జ‌ర‌గ‌న‌ప్పుడు, పంప‌కాలు పూర్తికాన‌ప్పుడు.. ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ‌యం ఇక్క‌డ తెలంగాణ‌లో కూడా చెల్లుబాటు అవుతుంద‌న్నారు. మొత్తానికి రేవంత్ ఓ కొత్త లాజిక్ తెర‌మీదికి తెచ్చారు. మరి దీనిపై ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.