హరీష్ రావుని నమ్మని కేసీఆర్.. హరీష్ వల్లే నర్సారెడ్డి కాంగ్రెస్ లోకి

 

తెరాస నేత హరీష్ రావుని మహాకూటమి నేతలు బాగా టార్గెట్ చేసినట్టున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి.. హరీష్ రావు తనకి ప్రైవేట్ నంబర్ నుంచి కాల్ చేసి కేసీఆర్ ని ఓడించమని చెప్పాడని.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో హరీష్ రావు టచ్ లో ఉన్నారని.. త్వరలో కాంగ్రెస్ లో చేరతారని సంచలన వ్యాఖ్యలు చేసిన చేసిన విషయం తెలిసిందే. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా.. హరీష్ రావు తెరాసలో ఇమడలేకపోతున్నారని, అసలు వైఎస్ఆర్ బ్రతికి ఉంటే హరీష్ రావు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో చేరి ఉండేవారని అన్నారు. తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..  హరీష్ రావు తలకాయ కోసుకుని కేసీఆర్ ముందు పెడితే ఇది తలకాయ కాదు పుచ్చకాయ అని అంటారని అన్నారు. ఎందుకంటే ‘నువ్వు ఎట్లాంటివాడివో.. నువ్వు నమ్మినవాళ్లను ఎలా మోసం చేశావో మీ మామ కేసీఆర్‌కు స్పష్టంగా తెలుసు' అని అన్నారు. నీ పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో మేనమామకు చెప్పాల్సిన అవసరం లేదని, నీ జాతకం అంతా మీ మామ వద్ద ఉన్నదని, నువ్వు ఏమేమి చేశావో కేసీఆర్‌కు తెలుసునని రేవంత్ అన్నారు. కేసీఆర్‌ను నమ్మించడానికి హరీశ్ పదే పదే మహాకూటమిపై విమర్శలు చేస్తున్నారని, ఇవాళ చంద్రబాబుకు లేఖ కూడా రాశారని రేవంత్ విమర్శించారు.

గత నెల 25వ తేదీ సాయంత్రం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గజ్వేల్లో ఉండే నర్సారెడ్డిని తీసుకుని హరీష్ క్వార్టర్‌కు వచ్చి 3 గంటలపాటు రహస్య చర్చలు జరిపిన తర్వాత, మరుసటి రోజు ఉదయం ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారంటే.. హరీష్-కేసీఆర్ మధ్య ఉప్పు, నిప్పులా ఉందా? లేదా? అన్నది ప్రజలకు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కారు డ్రైవర్‌ను మార్చవద్దని, ఇప్పుడు కారు వేగంగా పోతుందని కేటీఆర్ ప్రజలకు చెబుతున్నారని, ఇవాళ కారు డ్రైవర్‌ను మార్చాలని హరీష్ రావు చూస్తున్నారని అన్నారు. గజ్వేల్‌లో ఉండే తెరాస నేత హారీష్ ను కలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారని, దానికి హారీష్ ప్రజలకు సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉన్న సీసీ పుటేజీలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. 25న సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి వంటిగంట వరకు హరీశ్‌రావు ఇంటికి వచ్చిన కార్లు, వెళ్లిన కార్లు, ఎవరెవరు వచ్చి వెళ్లింది వివరాలను బయటపెడితే కేసీఆర్‌, కేటీఆర్‌కు స్పష్టత వస్తుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యలపై హరీష్ రావు ఎలా స్పందిస్తారో చూడాలి.