దేశంలోని ముఖ్యమంత్రుల్లో కేసీఆర్‌ అధముడు

 

తెరాస అధినేత ,ఆపద్ధర్మ ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీ,చంద్ర బాబుపై విమర్శలు చేస్తున్నారు.కేసీఆర్‌ చేస్తున్న విమర్శలు,తనపై ఐటీ దాడుల సందర్భంగా ఛానళ్లలో ప్రసారం అయన ప్రసారాలపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడారు.తన నివాసంలో ఐటీ రైడ్స్ సందర్భంగా కొన్ని చానెళ్లు,పత్రికలు తప్పుడు వార్తలు ప్రసారం చేశాయని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు హంకాంగ్, మలేషియా, సింగపూర్ లో బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు ఇచ్చిన తప్పుడు వార్తలపై 24 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆ సదరు మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
దేశంలోని ముఖ్యమంత్రుల్లోకల్లా కేసీఆర్‌ అధముడని రేవంత్ విమర్శలు గుప్పించారు.మోదీతో కుమ్మక్కై కేసీఆర్‌ రైల్వే కేసులన్నీ ఎత్తివేయించుకున్నారని ఆరోపించారు.మోదీకి కేసీఆర్‌ కుటుంబం మీద ఉన్న ప్రేమ...తెలంగాణ సమాజం మీద లేదన్నారు. ఆంధ్రావాళ్ళు అంటూ విమర్శలు చేస్తున్న కేసీఆర్‌ అమరావతి వెళ్లినప్పుడు ఆ విషయం గుర్తుకు రాలేదా? అని  రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబుపై  కేసీఆర్‌ దుర్మార్గంగా మాట్లాడటం పెద్ద కుట్రని,ఎన్నికలు కేసీఆర్‌ వర్సెస్‌ చంద్రబాబు అని చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు.చంద్రబాబును టార్గెట్‌ చేసి మరోసారి సెంటిమెంట్‌ను రగిల్చి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని ఆయన చూస్తున్నారని రేవంత్‌ ధ్వజమెత్తారు. చంద్రబాబుపై వాడుతున్న భాషను ప్రజలు గమనించాలని కోరారు.కేసీఆర్ ఆడుతున్న నాటకాన్ని ప్రజలు నమ్మడం లేదన్నారు.సీఎం పదవి పోతుందన్న భయంతో కేసీఆర్‌ నీచంగా వ్యవహరిస్తున్నారన్నారు.