కాంగ్రెస్ తో కష్టం.. బీజేపీలోకి రేవంత్ రెడ్డి!!

 

పరిస్థితిని బట్టి పద్దతి మార్చుకోవాలని మన పెద్దలు చెప్తుంటారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం.. అబ్బే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా మా తీరు మార్చుకునేది లేదని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అంత గొప్పగా ఏం లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2014 ఎన్నికల్లో దూసుకెళ్తుంది అనుకుంటే టీఆర్ఎస్ దూకుడు ముందు కాంగ్రెస్ నిలబడలేకపోయింది. పోనీ 2018 ఎన్నికల్లో అయినా మిగతా పార్టీల మద్దతుతో సత్తా చాటుతుంది అనుకుంటే.. మహాకూటమి రూపంలో మునిగిపోయింది. దానికి తోడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా దాదాపు పార్టీని వీడారు. మొత్తానికి కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. మరి ఇలాంటి సమయంలో నేతలంతా కలిసి పార్టీని పుంజుకునేలా చేయాలి. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం బహిరంగంగా విమర్శలు చేసుకుంటూ.. పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్ నేతల పోరు తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిలా మారింది.

కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు కొత్తేమి కాదు. దశాబ్దాలుగా ఆ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ కుర్చీ కోసం వర్గ పోరు ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. ఉత్తమ్ ని పీసీసీ చీఫ్ గా తప్పించి.. తమకి అవకాశం ఇవ్వాలని పలువురు సీనియర్లు డిమాండ్ చేసారు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు ఉత్తమ్ ని వ్యతిరేకిస్తూ బహిరంగంగానే విమర్శలు చేసారు. కోమటిరెడ్డి మాత్రమే కాదు.. పలువురు సీనియర్లు పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ ని వ్యతిరేకించారు. పీసీసీ కుర్చీపై కన్నేశారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఆ సీనియర్ నేతలంతా కలిసిపోయారు. వారి కలయికకు కారణం రేవంత్ రెడ్డి అనే చెప్పాలి.

రేవంత్ కి టీడీపీలో ఉన్న సమయంలోనే మాస్ లీడర్ గా మంచి గుర్తింపు ఉంది. కాంగ్రెస్ లో చేరాక కూడా ఆ క్రేజ్ అలాగే కొనసాగింది. అయితే రేవంత్ తో ఇన్నాళ్లు సీనియర్లకు అంతగా ప్రాబ్లమ్ రాలేదు. కానీ ఇటీవల రేవంత్.. కుటుంబ సమేతంగా వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. దీంతో పీసీసీ చీఫ్ గా త్వరలోనే రేవంత్ బాధ్యతలు చేపట్టనున్నారు అంటూ ప్రచారం మొదలైంది. దాంతోపాటే సీనియర్ నేతల్లో గుబులు మొదలైంది. ఇన్నాళ్లు మనలో మనం పోటీ పడ్డాం, ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ కి ఇస్తానంటే ఎలా ఊరుకుంటాం అనుకున్నారేమో.. అందరూ ఏకమయ్యారు. రేవంత్ ని టార్గెట్ చేస్తున్నారు.

దానికి తగ్గట్టే రేవంత్ తన వ్యాఖ్యలతో సీనియర్లకు అవకాశం ఇస్తున్నారు. హుజుర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థి, యురేనియం అంశాలలో.. రేవంత్ చేసిన వ్యాఖ్యలతో సీనియర్లంతా ఏకమై రేవంత్ ని కార్నర్ చేస్తున్నారు. మరోవైపు కోమటిరెడ్డి, విహెచ్, సంపత్ వంటి వారు పీసీసీ చీఫ్ గా తామే కరెక్ట్ అని చెప్పుకుంటున్నారు. ఓ రకంగా రేవంత్ పేరుకి కాంగ్రెస్ లో ఉన్నా ఒంటరిగానే ఉన్నారని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

సీనియర్లంతా ఏకమవ్వడం, రేవంత్ ఒంటరవ్వడంతో అధిష్టానం కూడా ఏం చేయలేని పరిస్థితి. ఒక్కడి కోసం అందర్నీ వదులుకోలేదు, అలా అని రేవంత్ ని కూడా వదులుకోవడానికి ఇష్టపడకపోవొచ్చు. మరి అధిష్టానం అందరికి సర్ది చెప్పి గొడవ సద్దు మణిగేలా చేస్తుందో లేక ఇలాగే మౌనంగా ఉండి పార్టీకి నష్టం చేసుకుంటుందో చూడాలి. ఏది ఏమైనా పరిస్థితి ఇలాగే కొనసాగితే రేవంత్ బీజేపీ వైపు చూసే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొంతకాలంగా బీజేపీ తెలంగాణలో బలపడే దిశగా అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అన్నట్టుగా దూసుకెళ్తోంది. ఇలాంటి సమయంలో రేవంత్ లాంటి నేతను కళ్ళకద్దుకొని తీసుకునే అవకాశం ఉంది. మరి రేవంత్ కాంగ్రెస్ లో వర్గ పోరు పడలేక బీజేపీలోకి చేరి తన సత్తా చూపుతారేమో చూడాలి.