చంద్రబాబులో మొదలైన సరి కొత్త టెన్షన్......

 

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం బిజెపి రాజ్య సభ సభ్యుడు సుజనా చౌదరితో విందు రాజకీయం టిడిపి అధినేత చంద్రబాబులో టెన్షన్ పీక్ స్టేజ్ కి తీసుకెళ్లిందట. ఈ నేపధ్యం లోనే ప్రకాశం జిల్లాలోని నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడటం ఇప్పుడు ఉత్కంఠకు తెరలేపింది. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో నాలుగు నియోజక వర్గాల్లో టిడిపి అభ్యర్ధులే గెలిచారు. చీరాలలో కరణం బలరాం, కొండేపిలో బాలవీరాంజనేయస్వామి, అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్, పరుచూరులో ఏలూరి సాంబశివరావు విజయం సాధించారు. అయితే వీరు మాత్రం పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు.

వైసీపీ ప్రభుత్వం నూతన ఇసుక విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నిరసనలు తెలిపింది. కానీ ప్రకాశం జిల్లాలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో నలుగురు ఎమ్మెల్యేలు పాల్గొనలేదు. రాష్ట్రమంతా టిడిపి శ్రేణులు ఇసుక విధానంపై ఆందోళన చేస్తుంటే అదే సమయంలో కరణం బలరాం బిజెపి రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరితో భేటీ జరిపారు. కరణం బలరాంను బిజెపిలో చేరమని సుజనా ఎప్పట్నుంచో అడుగుతున్నారట. దాంతో వీరిద్దరి భేటీ పార్టీలో కలకలం రేపింది. ఈ విషయాలన్నింటినీ గమనించిన చంద్రబాబు చీరాల, పర్చూరు, కొండెపి ఎమ్మెల్యేలతో విడివిడిగా చాలా సేపు ఫోన్ లో మాట్లాడం జరిగింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఫోన్ లో అందుబాటులోకి రాకపోవడంతో చంద్రబాబులో మరింత టెన్షన్ పెరిగిపోయింది. అయితే రెండ్రోజుల క్రితం రాత్రి చంద్రబాబును గొట్టిపాటి విజయవాడలో నేరుగా కలిశారని తెలుస్తుంది.

వాళ్లిద్దరి మధ్య జరిగిన చర్చల సారాంశం అయితే బయటకు రాలేదు. వంశీ రాజీనామా ఎపిసోడ్ తో పార్టీలో ఉండేదెవరో వెళ్లిపోయేదెవరో అర్థం కాక చంద్రబాబులో బిపి పెరిగిపోతోంది అని సమాచారం. అందుకే అందరు ఎమ్మెల్యేలతో తరచుగా  మాట్లాడుతూ ఆరాలు తీస్తున్నారని సమాచారం. మొత్తానికీ ప్రతిపక్షంలో ఉన్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో ఉండేదెవరు ఊడెదెవరూ అనేది మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుందని తెలుగు తమ్ముళ్లు వారి వైఖరిని వ్యక్తం చేస్తున్నారు.