వారంలో 4 లక్షల రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ రోగులకు అవసరమైన రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత రాకుండా జాగ్రత్తపడుతోంది. వారంలోగా ప్రభుత్వ ఆస్పత్రులకు 4 లక్షలకు పైగా రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందేలా చూస్తామని మున్సిపల్, ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. మంత్రి కేటీఆర్ బుధవారం రెమిడేసివిర్ ఉత్పత్తిదారులతో చర్చలు జరిపారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనం మేరకే ఈ చర్చలు జరిపామని కేటీఆర్ స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల కొరత పెరిగింది. వైరస్ సోకి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తుతున్న వారికి వైద్యులు ఆక్సిజన్‌తోపాటు రెమిడెసివిర్ ఇంజక్షన్‌లను ఇస్తున్నారు. ఫలితంగా వైరస్ లోడ్ తగ్గి రోగులు త్వరగా కోలుకుంటున్నట్టు చెబుతున్నాయి. ఇటీవల ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్యతో పాటే రెమిడెసివిర్ ఇంజక్షన్ల వినియోగం సైతం పెరిగింది.ఉత్పత్తి తగ్గడం.. చాలాచోట్ల ఇంజక్షన్లు లభించకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఉత్పత్తి పెంచాలని తయారీ సంస్థలతో మంత్రి కేటీఆర్‌ చర్చలు జరిపారు.