పండుమిరపకాయతో ఆరోగ్యం పదిలం

భారతీయులకు మిర్చి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన రోజువారీ జీవితంలో మిరపకాయలు లేనిదే పనిజరగదు. ఆయుర్వేదపరంగా కూడా మిర్చిని మితంగా తీసుకుంటే ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. వంటకాల్లో ఎండుకారం కంటే మిరపకాయలు వేసుకోవడమే ఆరోగ్యమని సూచిస్తుంటారు. అమెరికాలో జరిగిన ఓ పరిశోధన అయితే పండు మిరపకాయల వల్ల ఏకంగా ఆయుష్షే పెరుగుతోందని చెబుతోంది.

 

అమెరికాలోని వెర్మోంట్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మిరపకాయలకీ, ఆరోగ్యానికి మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు కొన్ని గణాంకాలను సేకరించారు. ఇందుకోసం పదహారు వేలమంది అమెరికన్లకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు 23 ఏళ్లపాటు వీరి ఆరోగ్య వివరాలను నిశితంగా గమనించారు. తాము సేకరించిన వివరాలలో పండు మిర్చి తినే అలవాటు కల్గినవారు కాస్త భిన్నంగా ఉన్నట్లు పరిశోధకులకు తోచింది. యువకులు, మంచి తిండిపుష్టి కలిగినవారు, మగవారు పండుమిరపకాయలను ఎక్కువగా తీసుకుంటున్నట్లు గమనించారు. తక్కువగా చదువుకుని చిన్నపాటి జీతాలతో బతికేవారిలో మిర్చిని తినే అలవాటు ఎక్కువగా కనిపించింది. (కాస్త జాగ్రత్తగా గమనిస్తే మన దేశంలో కూడా ఎండుమిర్చిని తినేవారు ఈ కోవకే చెందడాన్ని గమనించవచ్చు)

 

ఆశ్చర్యకరంగా పండుమిర్చి తినేవారిలో గుండెపోటు లేదా పక్షవాతంతో చనిపోయే అవకాశం ఏకంగా 13 శాతం తక్కువగా కనిపించింది. పండుమిరపకాయలు తినేవారు తప్పనిసరిగా సుదీర్ఘకాలం బతుకుతారన్న హామీని ఇవ్వలేం కానీ.... వారిలో కొన్నిరకాల ఆరోగ్యసమస్యల తాకిడి తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. మిర్చిలో ఉండే కేప్సైసిన్ (CAPSAICIN) వంటి పదార్థాల వల్ల రక్తప్రసారం మెరుగుపడుతుందనీ, శరీరంలోని హానికారక క్రిములు నశిస్తాయనీ భావిస్తున్నారు. రుచి, రంగు ఉండని ఈ కేప్సైసిన్ వల్ల మన కణాల మీద ఉండే Transient Receptor Potential (TRP) అనే వ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉంటుందట. ఇది కూడా దీర్ఘాయుష్షుకి కారణం అని నమ్ముతున్నారు.

 

పండుమిర్చి వల్ల ఉపయోగాలు ఉన్నాయంటూ శాస్త్రవేత్తలు ధృవీకరించడం ఇది మొదటిసారేం కాదు! మనలోని కొవ్వుపదార్థాలను విడగొట్టి ఊబకాయం దరిచేరకుండా చేయగల సమర్థత మిర్చికి ఉందని ఈపాటికే తేలిపోయింది. ఒంట్లో కొవ్వు పేరుకోకపోతే గుండె కూడా దృఢంగానే ఉంటుంది కదా! తాజా పరిశోధన ఈ విషయాన్నే రుజువులతో సహా నిరూపించింది. కాకపోతే మోతాదుకి మించి కారాన్ని తీసుకుంటే మాత్రం నానారకాల ఆరోగ్యసమస్యలూ దరిచేరక తప్పవంటున్నారు వైద్యలు. మితంగా తీసుకుంటే ఏ ఆహారం వల్లనైనా ఉపయోగమే అని పెద్దలు ఊరికే అనలేదు కదా.

- నిర్జర.