ఫైల్‌ను తిప్పి-పంపినందుకే తీసేశారు.. ఎల్వీ ఆకస్మిక బదిలీ వెనుక కారణాలివే..!

జగన్మోహన్‌రెడ్డి సర్కారు మరో అసాధారణమైన నిర్ణయం తీసుకుంది. ఎవరూ ఊహించనివిధంగా చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంపై బదిలీ వేటేసింది. ఎల్వీను ఆకస్మికంగా ట్రాన్స్‌ఫర్ చేసిన జగన్ ప్రభుత్వం.... బాపట్ల హెచ్ఆర్డీ డీజీగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎల్వీని తక్షణమే రిలీవ్ కావాలన్న ప్రభుత్వం... సీసీఎల్‌ఏ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్‌‌ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అయితే, మరో 5నెలల సర్వీసు ఉండగానే, ఎల్వీ సుబ్రమణ్యంపై బదిలీ వేటేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఎన్నికలకు ముందు అప్పటి సీఎస్‌ అనిల్‌చంద్ర పునేటాను తప్పించిన ఈసీ.... ఎల్వీకి బాధ్యతలు అప్పగించింది. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం... ఎల్వీని సీఎస్‌‌గా కొనసాగించింది. సీబీఐ కేసుల్లో జగన్‌కి ఎల్వీకి లింకులున్నాయంటూ ఆరోపణలు విమర్శలు వచ్చినా... సీఎస్‌‌గా కొనసాగించారు. అలాంటిదిప్పుడు సడన్‌గా ఎల్వీపై బదిలీ వేటేయడంతో అంతా షాక్ అవుతున్నారు.

అయితే, ఎల్వీపై బదిలీ వేటేయడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జీఏడీ పొలిటికల్ సెక్రటరీ, సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాషే కారణమని చెబుతున్నారు. ఎల్వీ, ప్రవీణ్ మధ్య తలెత్తిన విభేదాలు, ఆధిపత్య పోరే... ఆకస్మిక బదిలీకి కారణమని బ్యూరోక్రాట్స్‌ గుసగుసలాడుకుంటున్నారు. అయితే, ఎల్వీ బదిలీ వెనుక సీఎం జగన్ ఆగ్రహం ఉందని అంటున్నారు. తాను తీసుకునే నిర్ణయాలకు ఎస్...చెప్పకుండా ఫైల్స్ తిప్పిపంపడమే కారణమని చెబుతున్నారు.

అసలు ఈ వివాదానికి వైఎస్సార్ లైఫ్ టైమ్‌ అచీవ్‌మెంట్ అవార్డులే కారణంగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పద్మ పురస్కారాల స్థాయిలో వివిధ రంగాల్లోని నిపుణులకు వైఎస్సార్ అవార్డులు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించడంతో... ఆ ప్రతిపాదనల ఫైల్‌ను సీఎస్ ఆమోదం కోసం సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పంపారు. అయితే, అది ఆర్ధిక అంశంతో ముడిపడి ఉండటంతో... ఆర్ధికశాఖ కార్యదర్శికి పంపాల్సిందిగా ఆ ఫైల్‌ను ఎల్వీ తిప్పిపంపారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి కారణమైందట. ఏదైనా ఫైల్ ను సీఎంవో నుంచి పంపారంటే... అది ముఖ్యమంత్రి పంపినట్లే. అలాంటి ఫైల్ ను  ఎల్వీ తిప్పిపంపడంతో... సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాషే... ప్రపోజల్స్ ను కేబినెట్ ముందుంచారు. అయితే, కేబినెట్ ముందుకెళ్లే ప్రతి ఫైల్ కూ సీఎస్ ఆమోదం కావాల్సి ఉండటంతో.... ప్రవీణ్ చర్యపై ఎల్వీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎస్ ఆమోదం లేకుండా ఫైల్ ను నేరుగా మంత్రివర్గం ముందుంచడం బిజినెస్ రూల్స్‌కు వ్యతిరేకమని, ఇది గ్రాస్ వైలేషన్ కిందకి వస్తుందంటూ ప్రవీణ్ ప్రకాష్‌కు ఎల్వీ సుబ్రమణ్యం షోకాజ్ నోటీస్ ఇచ్చారు. నిబంధనల ఉల్లంఘనలపై 15రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ప్రవీణ్‌‌ను ఎల్వీ ఆదేశించారు.

మరోవైపు, కేబినెట్‌ ముందుంచాల్సిన పలు ప్రపోజల్స్‌ విషయంలో జీఏడీ పొలిటికల్ సెక్రటరీ, సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తన ఇష్టానుసారంగా వ్యవహరించడంపై ఎల్వీ ఫైరయ్యారు. సీఎస్ ఆమోదించిన ఫైల్స్ ను సైతం మంత్రివర్గం ముందుకు తీసుకెళ్లకుండా నిలిపివేయడంపై ప్రవీణ్ పై మండిపడ్డారు. అదే సమయంలో అక్టోబర్ 25న ప్రవీణ్ ప్రకాష్ పేరుతో విడుదలైన జీవో 28పైనా ఎల్వీ నిలదీశారు. ముఖ్యమంత్రి ఆదేశాలను తక్షణం జీవోలుగా తీసుకురాకపోతే, ప్రధాన కార్యదర్శులకు సైతం షోకాజ్ నోటీసులిచ్చే అధికారం తనకు(జీఏడీ కార్యదర్శిగా) ఉందంటూ ప్రవీణ్ ప్రకాష్ జీవో ఇచ్చారు. అయితే, ఆ అధికారాలు తనవైతే, వాటిని నీవెలా అతిక్రమిస్తావంటూ ప్రవీణ్‌‌పై ఎల్వీ మండిపడ్డారు. ఇలా ఇద్దరి మధ్య కొద్దిరోజులుగా కోల్డ్ వార్ జరుగుతుండగానే, సడన్‌‌గా సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని బదిలీ చేస్తూ ప్రవీణ్ ప్రకాష్‌ పేరుతో జీవో ఇవ్వడమే సంచలనంగా మారింది. మొత్తానికి ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీ ఏపీలో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. విపక్షాలు జగన్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తుంటే.... ఐఏఎస్, ఐపీఎస్ లు మాత్రం ఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వైపు వేలెత్తి చూపుతున్నారు. ప్రవీణ్ ను వివరణ కోరినందుకు అసలు ఆ పోస్టులో లేకుండా చేశారంటూ మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఎల్వీపై ఆకస్మిక బదిలీ వేటేయడం... ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. అది కూడా, ఎల్వీ కంటే జూనియరైన ప్రవీణ్ ప్రకాష్ పేరిట ఉత్తర్వులివ్వడం... అధికార యంత్రాంగంలో తీవ్ర సంచలనంగా మారింది.