బీజేపీతో యుద్దానికి సిద్దమైన జగన్.. ఎల్వీ బదిలీ వెనుక మాస్టర్ ప్లాన్!!

 

ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వంతో ఢీ కొట్టడానికి సిద్ధపడ్డారా? బీజేపీతో యుద్ధం చేయడం తప్ప వేరే దారి లేదన్న నిర్ణయానికి జగన్ వచ్చారా? అంటే అవుననే అనిపిస్తోంది. ఉన్నట్టుండి ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు పడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ వేటు వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏపీ సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఆయన అప్పటి సీఎం చంద్రబాబుకి వ్యతిరేకంగా, ప్రతిపక్ష నేత జగన్ కి మద్దతుగా ఎన్నికల సమయంలో పనిచేశారని ఆరోపణలు వచ్చాయి. నిజానికి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఆరెస్సెస్ తో సత్సంబందాలున్నాయి. దీంతో బీజేపీ-వైసీపీ కలిసి తమని ఇబ్బంది పెడుతున్నాయని టీడీపీ ఆరోపించింది. టీడీపీ అలా ఆరోపణలు చేస్తుండగానే.. ఎన్నికలు ముగిసాయి. టీడీపీ ఘోర పరాజయం పాలై ప్రతిపక్షానికి పరిమితమైంది. వైసీపీ ఘన విజయంతో అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అయ్యాక కూడా సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యంనే కొనసాగించారు. అయితే ఇప్పుడు దాదాపు ఐదు నెలల తరువాత ఆయనను సీఎస్ గా తప్పించారు. అయితే దీనివెనుక బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీని ఢీ కొట్టడానికి జగన్ సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది.

ముఖ్యంగా ఆరెస్సెస్ తో ఉన్న సంబంధాలు కారణంగానే ఎల్వీ సుబ్రహ్మణ్యంను తప్పించారని తెలుస్తోంది. ఏపీలో ఏ చిన్న విషయం జరిగినా ఎల్వీ ఆరెస్సెస్ కు చేరవేస్తున్నారట. అటునుంచి బీజేపీకి చేరుతున్నాయట. అంతేకాదు ఆరెస్సెస్- బీజేపీ కలిసి జగన్ కు చెక్ పెట్టే దిశగా పావులు కదుపుతున్నాయన్న సమాచారం కూడా జగన్ కి అందిందట. ఇటీవల కొందరు ఆరెస్సెస్ వ్యక్తులు తమ అంతర్గత సంభాషణల్లో.. ఒక్క సంవత్సరంలో జగన్ మళ్లీ జైలుకి వెళ్తారని అంటున్నారట. అంతేకాదు జగన్ జైలుకి వెళ్తే.. ఎల్వీ పదవీకాలాన్ని పొడిగించి.. ఆయన ద్వారా ఏపీలో రాజకీయాలు నడుపుతామని చెప్తున్నారట. ఈ అంతర్గత సంభాషణలు ఆ నోటా ఈ నోటా పడి.. జగన్ వరకు చేరడంతో.. ముందు జాగ్రత్తగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందు సీఎస్ గా ఎల్వీని తప్పిస్తే.. ఇక్కడి వ్యవహారాలు..  ఆరెస్సెస్- బీజేపీలకు చేరడం ఆగుతుంది. తరువాత కరెక్ట్ గా ప్లాన్ చేసి బీజేపీని ఢీ కొట్టాలని చూస్తున్నారట. మొత్తానికి ఎల్వీని తప్పించడం ద్వారా బీజేపీతో యుద్దానికి సిద్ధమని జగన్ పరోక్షంగా సంకేతాలు పంపినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.