అందుకోసమే రాజధాని నిర్మాణాలు ప్రభుత్వం ప్రారంభించిందా..?

 

రాజధాని నిర్మాణానికి భూసేకరణ కింద భూములిచ్చిన రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం పదమూడు ప్యాకేజీల్లో పదిహేడు వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు. ఇందులో సిమెంటు రహదారులు, విద్యుత్, మంచి నీరు పైపు లైన్లు, అత్యంత అధునాతనమైన రహదార్లు, సైకిల్ ట్రాక్ ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఈ ఖర్చును తగ్గించాలని నిర్ణయించింది. పదిహేడు వేల కోట్ల రూపాయల పనులను ఐదు వేల కోట్ల రూపాయలకు తగ్గించాలని భావిస్తుంది. సిమెంట్ రహదారుల స్థానంలో తారు రోడ్డు, సైకిల్ ట్రాక్ ఎత్తేసి కనీస మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వం సీఆర్డీఏ అధికారులకు సూచించింది.

రాజధానులు, రహదారుల నిర్మాణంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాజధానిలో రహదారుల నిర్మాణానికి అమరావతి అభివృద్ధి సంస్థ టెండర్లను పిలిచింది. అనేక రహదారుల నిర్మాణం దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం వరకు పూర్తయ్యాయి, కొన్ని రహదారుల నిర్మాణం ప్రారంభం కాలేదు. అవసరమైన రహదారుల నిర్మాణం మాత్రమే చేపట్టాలని మొత్తం ఐదు వేల కోట్ల రూపాయలకు ఖర్చును కుదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. రాజధానుల్లో నిత్యం రాకపోకలకు అవసరమైన రహదారులను మాత్రమే చేపట్టాలని సూచించింది.

సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. రాజధాని నిర్మాణానికి నిధుల కొరత ఎక్కువగా ఉందని ప్రభుత్వం చెప్తోంది. రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చే పలు జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక సంస్థలు వెనక్కు వెళ్లడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. రాజధాని నిర్మాణాన్ని నిలిపివేశారని హై కోర్టును కూడా తరలిస్తున్నారనే ప్రచారం కోస్తా జిల్లాల్లో ఊపందుకోవడంతో పరిమిత వనరులతో అవసరమైన మేరకే రాజధాని నిర్మాణం చేపడితే ఈ ప్రచారానికి తెర దించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. అందువల్లే రాజధాని నిర్మాణాలపై ప్రభుత్వం అడుగు ముందుకు వేస్తుందని చెబుతున్నారు.