పోసాని-పృథ్వీ పెయిడ్ వార్ వెనుక అసలు కారణం ఏమిటంటే...

పృథ్వీ చేసిన కామెంట్లే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలూ చేశారు. పెయిడ్ ఆర్టిస్టులతో ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. వీరంతా అలాంటి మాటలే అన్నప్పటికీ, కేవలం పృథ్వీనే లక్ష్యంగా చేసుకుని పోసాని మాట్లాడ్డంపై వైసీపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఒకవైపు జగన్‌ను పొగుడుతూనే మరోవైపు పృథ్వీపై విమర్శలదాడి చేయడంలో పోసాని లెక్కలు వేరే ఉన్నాయని అంటున్నారు.

పోసాని కృష్ణమురళి మొదటి నుంచీ జగన్‌కు అండగా ఉన్నారు. పార్టీ పెట్టిన కొత్తలోనే రోజాతోపాటు జగన్‌ వెంట నడిచింది పోసాని కృష్ణమురళే. చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైరవుతూ ప్రెస్‌మీట్లు పెట్టారు, జగన్‌ను ఆకాశానికెత్తుతూ లెక్కలేనన్ని సార్లు ప్రశంసలు కురిపించారు. పాదయాత్ర టైంలోనూ జగన్‌ దగ్గరికెళ్లి మద్దతు పలికారు. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అసలు తనను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు పోసాని. అంతేకాదు, తన తర్వాత పార్టీలోకి వచ్చిన సినిమా నటులకు జగన్‌ ప్రాధాన్యత ఇవ్వడాన్ని కూడా పోసాని జీర్జించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి విజయ్ చందర్‌‌కు ఇవ్వగా ఎస్వీబీసీ ఛైర్మన్‌గా పృథ్వీరాజ్‌ను చేశారు జగన్. అదే పోసానికి కోపానికి కారణమంటున్నారు. తన తర్వాత పార్టీలోకి వచ్చిన పృథ్వీకి ఎస్వీబీసీ పదవి ఇచ్చి, కనీసం తనకు ఎలాంటి నామినేటెడ్‌ పదవి ఇవ్వకపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. అందుకే, పృథ్వీని అదేపనిగా విమర్శించారనే మాట వినిపిస్తోంది.

అయితే, రాజధాని రైతులపై ఒకవైపు పృథ్వీని టార్గెట్ చేస్తూనే, మరోవైపు జగన్‌‌పై ప్రశంసలు కురిపించారు పోసాని. మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతు పలికారు. కావాలనే జగన్‌పై చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మాట్లాడారు. అంటే పోసాని టార్గెట్‌ రాజధాని మార్పూ కాదు, పెయిడ్ ఆర్టిస్టులన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు కాదు, కేవలం పృథ్వీ మాతమేనని క్లియర్ గా తెలుస్తోందని అంటున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, మహిళా రైతులను కించపరిచేలా మాట్లాడుతున్న పృథ్వీకి, వైసీపీలో ఇంత ప్రాధాన్యం ఎందుకిస్తున్నారో తెలియడం లేదంటూ తన సన్నిహితులతో పోసాని అన్నట్లు తెలుస్తోంది.