ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ కు బహిరంగలేఖ.. రాజకీయ చదరంగం మొదలుపెట్టిన డీఎస్!!

 

రాజకీయాల్లో అన్ని దానాల కంటే నిదానం మంచిది అన్నారు పెద్దలు. ప్రస్తుతం టీఆర్ఎస్ లో డి శ్రీనివాస్ ఈ నినాదాన్నే పాటిస్తున్నారు. పేరుకే ఆ పార్టీలొ ఉన్నారు గాని ఆయన నోరు మెదపడం లేదు. టీఆర్ఎస్ పెద్దలతో గ్యాప్ ఏర్పడిన తరువాత ఆయన సరైన సమయం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. అదును చూసి ఇప్పుడైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఓ లేఖాస్త్రం సంధించారు. 

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతుంది. మొదట్లో ఒకరిద్దరు మంత్రులు సమ్మెపై స్పందించి విమర్శల పాలయ్యారు. ఆ తర్వాత మిగతా నేతలెవరూ పెదవి కదపటంలేదు. సమ్మెపై స్పందిస్తే ఎక్కడ బాస్ ఆగ్రహానికి గురికావలసి వస్తుందోనన్న భయంతో అందరూ సైలెంట్ అయిపోయారు. ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అంశమే ఇప్పుడు గులాబీ పార్టీ వర్గాల్లో చర్చలకు దారి తీస్తుంది. ఆర్టీసీ సమ్మెపై డీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఓ వైపు సూచన చేస్తూనే మరోవైపు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. విభజన జరగని ఏపీఎస్ఆర్టీసీని ఎలా ప్రైవేటీకరణ చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ తన స్వభావానికి విరుద్ధంగా వ్యవహరించడం వెనుక ఏదో కుట్ర కోణం దాగుందని డీఎస్ తన బహిరంగ లేఖలో పేర్కొనడం గమనార్హం. 

అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి టీఆర్ఎస్ పార్టీతో డి శ్రీనివాస్ అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. డీఎస్ తనయుడు ధర్మపురి అరవింద్ బిజెపిలో చేరడంతో పాటు అప్పటి సిట్టింగ్ ఎంపీ కవితపై విమర్శలు గుప్పించడం టీఆర్ఎస్ పెద్దలకు రుచించలేదు. దీంతో డీఎస్ కూడా పార్టీ మారుతారంటూ అప్పట్లో చర్చ జరిగింది. డీఎస్ మాత్రం తన కుమారుడుది తనది రాజకీయంగా వేరు వేరు దారులని బహిరంగంగానే చెప్పారు. ఇదే సమయంలో నిజామాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారంటూ మాజీ ఎంపీ కవిత నేతృత్వంలో ఆ జిల్లా నేతలు గులాబీ పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. డీఎస్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కోరారు. అయితే ఆ అంశంపై ఏ నిర్ణయం తీసుకోకుండా టీఆర్ఎస్ అధినేత పెండింగ్ లో పెట్టారు. ఈ నేపథ్యంలో పరోక్షంగా డీఎస్ ను పార్టీ నుంచి పక్కన పెట్టారన్న  వాదన కొనసాగుతోంది. ఈ పరిస్థితిలో ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ కు డి.శ్రీనివాస్ లేఖ రాయడం తాజా కోణం. అయితే డీఎస్ మాత్రం తాను రాసిన లేఖపై ముఖ్యమంత్రి స్పందన కోసం చూస్తున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు సూచనలని పరిగణలోకి తీసుకోని కేసీఆర్ డీఎస్ లేఖని ఖాతరు చేయరని అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. ఇప్పటికే డీఎస్ ను పొమ్మనలేక పొగబెట్టారాని అందువల్ల ఆయన లేఖకి పెద్దగా విలువ ఇవ్వకపోవచ్చు అని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. 

సమయం చూసి డీఎస్ పై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ పెద్దల భావిస్తున్న తరుణంలోనే ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాయడం ద్వారా రాజకీయ చదరంగం మొదలు పెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. తనింకా ఆ పార్టీలోనే ఉన్నానని వారికి గుర్తు చేశారని అంటున్నారు. అంతేకాదు సీనియర్ రాజకీయ నేతగా ఆర్టీసీపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే డీఎస్ లేఖ రాశారని అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఒక వైపు తనపై వేటు వేయాలని పార్టీ కాచుకొని ఉండడం మరోవైపు కొంతకాలం నుంచి రాజకీయంగా తెరమరుగు కావడం డీఎస్ కు మింగుడు పడటం లేదట. ఈ తరుణంలోనే టీఆర్ఎస్ అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోవడానికి ఆయన సిద్ధపడుతున్నారన్న చర్చ డీఎస్ వర్గీయుల్లో కొనసాగుతుంది. మరి ఈ లేఖ వ్యవహారంపై గులాబి అధినేత స్పందిస్తారో లేదో చూడాలి.