చర్చనీయాంశంగా మారిన చిరంజీవి జగన్ ల భేటీ...

 

చిరంజీవి జగన్ భేటీ ఇటు సినీ ఇండస్ట్రీలో అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా మెగాస్టార్ రాజకీయాలకు దూరంగా, సినిమాలకు దగ్గరగా ఉంటున్నారు. పాలిటిక్స్ అనే పదం వినబడనంత దూరంగా చిరంజీవి వెళ్లి పోయారు.  తానిప్పుడు పూర్తిగా సినిమాలకు అంకితం అంటున్నాడు, అలాంటి సమయంలో ఆయన ఉన్నట్టుండి ఏపీ సీఎం వైయస్ జగన్ తో భేటీ అవుతుండటం రాజకీయ వర్గాల్లోనే కాదు సినీ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది. అసలిప్పుడు ముఖ్యమంత్రి జగన్ ను కలవాల్సిన అవసరం చిరంజీవికి ఏం వచ్చింది, ఎందుకు ఇప్పుడు చిరంజీవి జగన్ తో భేటీ అవుతున్నారంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఏపీలో మెగాస్టార్ సోదరుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా జగన్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు. సమయం దొరికిన ప్రతిసారీ ముఖ్యమంత్రి జగన్ ను విమర్శిస్తున్నాడు. ఇలాంటి సమయంలో చిరు జగన్ భేటీ ఏంటి అని అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి యొక్క భేటీ రాజకీయాల కోసమా లేక మర్యాదపూర్వక భేటీనా అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీఎం జగన్ ను కలిసేందుకు చిరంజీవి, రాంచరణ్, మాజీ మంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడ బయలుదేరి వెళ్తారు. మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు తాడేపల్లిగూడెం లోని జగన్ నివాసంలో భేటీ అవుతారు.

సమావేశం తర్వాత అక్కడే ఇద్దరూ కలిసి లంఛ్ చేయనున్నట్టుగా సమాచారం. చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యంతోనే గంటా వస్తున్నట్టుగా సమాచారం, తాడేపల్లిగూడెంలో ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గంటా శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. గత కొద్ది కాలంగా గంటా పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జగన్ తో భేటీ ఆసక్తికరంగా మారింది. మరోవైపు గంటా శ్రీనివాసరావు పార్టీ మారే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లుగా సమాచారం.

ఇరువర్గాలు కూడా చిరంజీవి జగన్ ల మధ్య మర్యాదపూర్వక సమావేశమే అంటున్నప్పటికీ, రాజకీయ వర్గాల్లో మాత్రం చర్చ జోరుగా జరుగుతోంది. జగన్ సీఎం అయిన తరువాత టాలీవుడ్ నుంచి పెద్ద స్టార్స్ ఎవరూ ఆయనను మర్యాద పూర్వకంగా కలవలేదని విమర్శలు కూడా వచ్చాయి. టాలీవుడ్ లోని కొందరు ప్రముఖులకు జగన్ సీఎం కావడం ఇష్టం లేదని నటుడు ఎస్వీబీసీ ఛైర్మన్ పృధ్వీ కూడా అప్పట్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విమర్శల నేపథ్యంలో టాలీవుడ్ నుంచి చిరంజీవి జగన్ ను కలవనుండటంతో అటు టాలీవుడ్ తో పాటు ఇటు రాజకీయ వర్గాలు కూడా ఈ పరిణామాలను ఆసక్తికరంగా గమనిస్తున్నాయి.