కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడటానికి తెలుగు సినీ ప్రముఖుల సాయం!

 

కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. 15 శాసన సభ స్థానాలకు ప్రచారం ముగిసింది అక్కడ. గురువారం ఉప ఎన్నికలు జరుగుతాయి. 13 మంది కాంగ్రెస్, జేడీఎస్ రెబల్స్ కు టికెట్ ఇచ్చిన బిజెపి తన ఆలోచనను చెప్పేసింది. 2018 శాసన సభ ఎన్నికల తరవాత యడ్యూరప్ప సీఎం అయ్యారు. మధ్యలో జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ నేతగా కుమారస్వామి కొంతకాలం ముఖ్యమంత్రిగా నిర్వహించారు. ఇప్పుడు యడ్యూరప్ప అధికారాన్ని నిలబెట్టుకుంటారా లేదా అన్నది పెద్ద ప్రశ్న. 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో 17 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇటీవలే జరిగిన విశ్వాస పరీక్షలో యడ్యూరప్పకు అనుకూలంగా 106 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాలొచ్చే డిసెంబరు 9 నాటికి అసెంబ్లీ బలం 222 గా వుంటుంది. అంటే కనీస మెజారిటీకి 112 మంది మద్దతు అవసరం. బిజెపి తరపున మరో 6 గురు గెలిస్తే యడియూరప్ప ప్రభుత్వం గట్టెక్కినట్లే. 15 స్థానాల్లో ఘన విజయం సాధిస్తామని బీజేపీ చెప్పుకుంటుంది. కాంగ్రెస్, జేడీఎస్ వాదన మాత్రం మరోలా ఉంది. బిజెపి 2,3 స్థానాలకు మించి గెలవదని కాంగ్రెస్ అంటోంది. మహారాష్ట్ర పరిణామాల్ని గుర్తు చేస్తూ త్వరలో విపక్ష సంకీర్ణం కర్ణాటకలో కూడా ఏర్పాటు కావడం ఖాయమని కాంగ్రెస్ నేతలు విశ్లేషించుకుంటున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత విడిపోయిన కాంగ్రెస్ ,జేడీఎస్ మళ్లీ చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఉప ఎన్నికల ఫలితాలను బట్టి 2 పార్టీలు కలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. సీఎం పదవిపై పీటముడి లేదని అవసరాన్ని అవకాశాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని మాజీ సీఎం కుమారస్వామి తెలిపారు. 

కర్ణాటక ఉప ఎన్నికల ప్రభావం పడమటి నుంచి తూర్పుకు మారుతుందా..ఏపీ రాజకీయాల పై కర్ణాటక ప్రభావం ఉంటుందా అనే సందేహం వ్యక్తం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి కర్ణాటకలో ఎందుకు ప్రచారం చేస్తున్నారు, ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ పరిశీలకుల్ని వేధిస్తున్నాయి. హాస్య బ్రహ్మగా పిలిచే గిన్నిస్ రికార్డు హోల్డర్ బ్రహ్మానందం ఈ ఉప ఎన్నికలో కర్ణాటక బీజేపీ తరపున ప్రచారం చేశారు. చిక్కబళ్ళాపురంలో బీజేపీ అభ్యర్థి సుధాకర్ రెడ్డి కోసం ఆయన వీధివీధినా ప్రచారం చేశారు. తెలుగులో మాట్లాడిన బ్రహ్మానందం బీజేపీ అభ్యర్థి తనకు మంచి మిత్రుడని అందుకే ప్రచారానికి వచ్చారని చెప్పుకున్నారు. బ్రహ్మానందాన్ని చూసేందుకు జనం భారీ సంఖ్యలో తరలి రావడంతో పాటు ఆయన చెబుతున్న తెలుగు సినిమా డైలాగులకు కేరింతలు కొట్టారు. అభిమానుల్లో ఉత్సాహం చూస్తే సుధాకరెడ్డి సునాయసంగా గెలుస్తారన్న నమ్మకం తనకుందని బ్రహ్మానందం అన్నారు. బ్రహ్మానందంతో పాటు డైలాగ్ కింగ్ సాయి కుమార్ కూడా బీజేపీ తరపున ప్రచారం చేశారు. బ్రహ్మానందం ,సాయికుమార్ ఒకే చోట బస చేయడం కూడా విశేషమని బిజెపి శ్రేణులు చెబుతున్నాయి. బీజేపీ తరపున బ్రహ్మానందం ప్రచారం దేనికి సంకేతం, బ్రహ్మానందం బీజేపీలో చేరే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. అది ఏపీ బీజేపీకి ప్రయోజనకరమని విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి పొలిటికల్ స్టార్సే కానీ సినీ స్టార్స్ పెద్దగా లేరు. రాష్ట్రంలో బలపడాలనుకుంటున్న కమలం పార్టీ పాపులర్ ఫేస్ కోసం వెతుకుతూనే ఉంది. ప్రస్తుతం టిడిపి, వైసిపిలో సినీ ప్రముఖులు ఎక్కువ మంది ఉన్నారు. బ్రహ్మానందంలాంటి పాపులర్ నటుడు బీజేపీలో చేరితే ట్రెండ్ మారుతుంది.. మరికొంతమంది సినీజనం పార్టీలోకి వస్తారు.. అలా పార్టీ బలపడే అవకాశముంటుంది. పార్టీ సభలకు జనం వస్తే ఓటర్లలో కూడా నమ్మకం పెరుగుతుంది. మరి బ్రహ్మానందం బిజెపిలో చేరాలంటే ఆయన ప్రచారం చేసిన చిక్కబళ్లపురంలో పార్టీ గెలవాలి. హాస్యబ్రహ్మ ప్రచారం చేసినందుకే గెలిచారన్న టాక్ రావాలి. అందుకే కర్ణాటక ఫలితాల ప్రభావం ఏపీపై ఉంటుందనీ భావించాల్సి ఉంటుంది.