హస్తిన చుట్టూ ఏపీ ఐఏఎస్ అధికారుల ప్రదక్షిణలు.. ఏం జరుగుతోంది?

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీ నుంచి హస్తినకు ఐఏఎస్ అధికారుల టూర్లు గతంతో పోలిస్తే ఎక్కువయ్యాయి. ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యలతో పాటు మూడు రాజధానుల వ్యవహారం, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం అధికారులు కేంద్రంతో సంప్రదింపుల ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో జగన్ భేటీల నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న పనుల కోసమే ఐఏఎస్ లు ఢిల్లీలో మకాం వేసినట్లు సమాచారం.

ఏపీలో మే నెల తర్వాత మూడు రాజధానుల ప్రక్రియను అమల్లో పెట్టాలని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వం అందుకు తగినట్లుగా కార్యాచరణను వేగవంతం చేసింది. ఇప్పటికే తన తాజా ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం జగన్.. ఆ మేరకు తన మనసులో మాటను వారి చెవిన వేయడం దానికి గ్రీన్ సిగ్నల్ లభించడం జరిగిపోయాయి. ఢిల్లీ నుంచి తిరిగివచ్చాక సీఎం జగన్ తో భేటీ అయిన పలువురు అధికారులు, వైసీపీ పెద్దలతో మాట్లాడినప్పుడు వారు ముఖ్యమంత్రి అనుకున్నవన్నీ జరిగేలా కేంద్రం నుంచి గట్టి హా్మీ లభించినట్లు తెలిసింది. దీని ఆధారంగా తదుపరి ప్రక్రియను మొదలుపెట్టాలని భావిస్తున్న జగన్ తన ప్రబుత్వంలోని కీలకమైన ఐఏఎస్ అధికారులను ఢిల్లీలోని సంబంధిత శాఖల వద్దకు పంపినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోలను గమనించినా ఐఏఎస్ అధికారులు హస్తినకు క్యూ కట్టిన విషయం ఇట్టే అర్ధమవుతుంది.

మోడీ, అమిత్ షా ఇచ్చిన హామీల్లో మొదటిది శాసనమండలి రద్దు కాగా రెండోది కర్నూలుకు హైకోర్టు తరలింపు, విభజన సమస్యల పరిష్కారం, రాష్ట్రానికి నిధులు ఇతర హామీలు. అయితే వీటిలో మొదటిదైన శాసనమండలి రద్దుకు వచ్చే నెల 2న ప్రారంభమయ్యే బడ్జెట్ రెండో విడత సమావేశాలు వేదిక కానున్నాయి. ఈ సమావేశాల్లోనే మండలి రద్దుకు కేంద్రం పార్లమెంటు ఉభయసభల్లో బిల్లులు ప్రవేశపెట్టడం ఆమోదించడం జరుగుతుందని ఢిల్లీ సర్కిల్స్ లోనూ గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టు తరలింపు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో హైకోర్టు తరలింపునకు సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర న్యాయశాఖ అనుమతి తప్పనిసరి. కేంద్ర న్యాయశాఖ నుంచి అనుమతి లభిస్తే తరలింపునకు అవసరమైన మిగతా ప్రక్రియను సుప్రీంకోర్టు చేపట్టడం లాంఛనమే అవుతుంది. కాబట్టి న్యాయశాఖ వర్గాల వద్ద ఏపీ ఐఏఎస్ లు ఈ అంశంపైనా లాబీయింగ్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో చంద్రబాబు సర్కారు తరహాలోనే ఐఏఎస్ అధికారులపైనే ఎక్కువగా ఆధారపడుతున్న జగన్ సర్కారు... కేంద్రంతో లాబీయింగ్ లోనూ వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్ధమవుతోంది. అదే సమయంలో గతంలో కేంద్రంలో పనిచేసిన రాష్ట్రానికి చెందిన కొందరు ఐఏఎస్ ల పరిచయాలను కూడా వాడుకోవడం ద్వారా కేంద్రం ఇస్తున్న హామీలను తమకు అనుకూలంగా మార్చుకునేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం.