విభజనతో ఆంధ్రాలో రియల్ బూమ్

 

ప్రస్తుతం రాష్ట్ర విభజనతో సీమంద్రా ప్రాంతం అట్టుడుకుతున్నపటికీ, త్వరలోనే అంతా సద్దు మణిగి తిరిగి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటే, రెండు రాష్ట్రాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకొంటుందని, ముఖ్యంగా కొత్త రాజధాని, శాసనసభ, హైకోర్టు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు మొదలయిన నిర్మాణ కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగబోతున్నందున ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకొంటుందని ఆ రంగానికి చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, నిర్మాణ రంగం, దానిని అనుబంధంగా ఉన్న పరిశ్రమలకి, వ్యాపారాలకి ఆయా రంగంలో పనిచేస్తున్ననిపుణులకి, కార్మికులకి మంచి గిరాకి ఏర్పడుతుందని నిపుణులు చెపుతున్నారు. అదే విధంగా రాజధాని పరిసర జిల్లాలు కూడా త్వరితగతిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకొంటాయి, గనుక రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం దాదాపు 40 శాతం వరకు పెరుగుతుందని నిపుణుల అంచనా వేస్తున్నారు.

 

అయితే, ఇది వెన్వెంటనే మొదలవకపోయినా రానున్న 6 నుండి 8 నెలలో క్రమంగా పెరుగుతుందని, రానున్న ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత అది మరింత పుంజుకొని, రెండు మూడు సం.లలో పతాక స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని బహుశః ఒంగోలు గుంటూరు మద్య ఎక్కడయినా ఏర్పరిచే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపద్యంలో ఆ పరిసర జిల్లాలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం రెట్టింపు అవుతుందని అంచనా.

 

ఇక విశాఖ, రాజమండ్రీ, తూర్పు, పశ్చిమ గోదావరి కర్నూలు, నెల్లూరు, తిరుపతి ప్రాంతాలలో కూడా దీని ప్రభావం బాగా కనిపిస్తుందని భావిస్తున్నారు. అయితే, విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, చిత్తూరు వంటి ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మరీ భారీ పెరుగుదల ఉండకపోవచ్చును. కానీ, కొత్తగా రాష్ట్రం ఏర్పడిన కారణంగా 10 నుండి 15 శాతం పెరిగే అవకాశం ఉంటుందని నిపుణుల చెపుతున్నారు.

 

ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాలలో భూములు కొనుగోలు చేసి ఉంచుకొన్న ప్రవాసాంధ్రులు నిర్మాణ కార్యక్రమాలు చెప్పట్టే అవకాశం ఉందని, అదేవిధంగా మరనేక మంది భూములు కొనుగోలుకు ఆసక్తి చూపించే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. ఇక రాష్ట్రానికి భారీ పరిశ్రమలు, పెద్ద పెద్ద విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు కూడా వచ్చే అవకాశం ఉంది గనుక రాష్ట్ర వ్యాప్తంగా భూముల కొరత ఏర్పడి ధరలకు రెక్కలు రావచ్చునని నిపుణులు చెపుతున్నారు.

 

ఇక, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మొదలవగానే దేశ విదేశాల నుండి పెద్ద ఎత్తున పరిశ్రమలు, వ్యాపారాలు, మౌలిక వసతులు వంటి వాటిలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా చాలామంది చొరవ చూపవచ్చునని, కానీ అందుకు సుస్థిరమయిన ప్రభుత్వము, ఆకర్షణీయమయిన ప్రభుత్వ విధానాలు ఉన్నపుడే అభివృద్ధి శరవేగంతో జరుగుతుందని, ఒకవేళ మొదటి రెండు సం.లలో ప్రభుత్వం అస్థిరంగా ఉంటే కనుక, దాని ప్రభావం రాష్ట్రంపై చిరకాలం ఉండిపోయే ప్రమాదం ఉందని, అదే జరిగితే అభివృద్ధి నత్త నడకన సాగుతుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

మంచి పరిపాలనా, వ్యాపార దక్షులుగా పేరున్నఆంధ్ర రాజకీయ నేతలు, వ్యాపారులు అందివచ్చిన ఈ సువర్ణావకాశాన్నిచక్కగా అందిపుచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడం ఖాయమని వారు దృడంగా చెపుతున్నారు.