మల్లన్న సాగర్ నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యం.. అధికారులకు జైలు శిక్ష!!

 

తమ బాధ్యతను మరచి నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా, కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయని ఇద్దరు అధికారులకు తెలంగాణ హైకోర్టు జైలు శిక్ష విధించి బుద్ది చెప్పింది. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు సిద్దిపేట జిల్లా తోగుట్ట ఆర్డీవో విజేందర్ రెడ్డి, తహశీల్దార్‌ ప్రభులకు హైకోర్టు.. 2 నెలల జైలు శిక్ష విధించింది. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు గతంలో ఆదేశించినా.. కోర్టు ఆదేశాలను లెక్క చేయకపోవడంతో వీరికి శిక్ష విధించింది. కోర్టు ఆదేశించినా అధికారుల తీరు మారలేదని, తమకు న్యాయం జరగలేదని మల్లన్నసాగర్ నిర్వాసితులు మరోసారి హైకోర్టును ఆశ్రయించడంతో.. నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వారికి పరిహారం చెల్లించాలని సీఎం కేసీఆర్ గతంలో అధికారులను ఆదేశించినా.. ఇంకా పరిహారం అందని రైతులు అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మరి ఇప్పటికైనా అధికారుల తీరు మారుతుందేమో చూడాలి.